తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్టోబరు నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం.. వెలుగులోకి సంచలన విషయాలు

TSPSC Question Paper Leakage Case updates: దొంగలు పడ్డ ఆరునెలలకు.. అన్న చందంగా.. టీఎస్​పీఎస్​సీ​లో ప్రశ్నపత్రం లీకేజీ బాగోతం బయటపడింది. లీకేజీ ఒకటి, రెండు పరీక్షలకు పరిమితం కాదని అక్టోబర్‌ నుంచే రాజశేఖర్‌, ప్రవీణ్‌లు కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు తేలింది. అన్నీ తామై వ్యవహరించిన వీరు తోడుదొంగల్లా మారి అన్ని పరీక్షలపైనా కన్నేసినట్లు తేలింది. రేణుక అడిగినందుకే ప్రశ్నపత్రం ఇచ్చానని ప్రవీణ్‌ చెప్పిందంతా నాటకమని బయటపడింది. లక్షలాది మంది భవితవ్యం నిర్దేశించే పరీక్షా పేపర్లు అలవోకగా కొట్టేస్తున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

tspsc leak
అక్టోబరు నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం.. వెలుగులోకి సంచలన విషయాలు

By

Published : Mar 18, 2023, 7:28 AM IST

TSPSC Question Paper Leakage Case updates: టీఎస్​పీఎస్​సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్‌ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్​పీఎస్​సీ కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్‌ ఎనలిస్ట్‌ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్‌ల ద్వయం అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజశేఖర్‌ ఎలాంటి సమాచారమైనా తస్కరించి ప్రవీణ్‌కు అందజేసేవాడని బయటపడింది.

కమిషన్‌ కార్యాలయంలో వీరు సాగించిన హవా చూసి అధికారులు సైతం ఆశ్చర్య పోయిట్లు తెలుస్తోది. టౌన్‌ ప్లానింగ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయిందన్న ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో ప్రవీణ్‌ వ్యవహారం బయటపడింది. తన స్నేహితురాలు రేణుక అభ్యర్థన మేరకు మిత్రుడు రాజశేఖర్‌తో కలిసి ఏఈఈ ప్రశ్నాపత్రం తస్కరించి ఇచ్చానని చెప్పిదంతా అబద్ధమని తేలింది. లీకేజీ ఆ పరీక్షకు మాత్రమే పరిమితమని నమ్మించేందుకే రేణుక ప్రస్తావన తెచ్చాడని.. వాస్తవానికి మిగతా ప్రశ్నపత్రాలనూ ప్రవీణ్, రాజశేఖర్‌ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తోంది.

కమిషన్‌ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించి, దాని ద్వారా ఫిబ్రవరిలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఫోల్డర్‌ను నాలుగు పెన్‌డ్రైవ్‌లలో కాపీ చేసుకున్నట్లు రాజశేఖర్‌ చెప్పాడు. కానీ, అక్టోబరులోనే ప్రశ్నపత్రాలు తస్కరించినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబరు 16న జరిగిన గ్రూప్‌-1 పరీక్షలో ప్రవీణ్‌కు మంచి మార్కులు వచ్చినట్లు తేలగానే అనుమానాలు ముసురుకున్నాయి. ఆ అనుమానంతోనే లోతుగా దర్యాప్తు చేయగా.. ఇందులో అక్టోబరు నుంచే కమిషన్‌ కంప్యూటర్‌ వ్యవస్థను రాజశేఖర్, ప్రవీణ్‌లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు నిర్ధారణ అయింది.

దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు పెన్‌డ్రైవ్‌ నాటకం ఆడారని తేలిపోయింది. ఏడాది క్రితం కార్యాలయంలోని కంప్యూటర్‌ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేయగా అప్పటి నుంచే ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రాజశేఖర్‌, ప్రవీణ్‌ ప్రణాళిక మొదలుపెట్టారు. సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి ఆధ్వర్యంలో కమిషన్‌లో కాన్ఫిడెన్షియల్‌ విభాగం పని చేస్తుంది. కార్యదర్శి, ఛైర్మన్‌లకు మాత్రం అజమాయిషీ ఉండే ఈ విభాగంలోని కంప్యూటర్‌లలో ప్రశ్నాపత్రాలను నిక్షిప్తం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ అప్‌గ్రేడేషన్‌ పేరుతో డైనమిక్‌ ఐపీని స్టాటిక్‌ ఐపీగా మార్చాడు.

TSPSC question paper case: కాన్ఫిడెన్షియల్‌ విభాగంలోని కంప్యూటర్‌ను తన కంప్యూటర్‌ ద్వారా నియంత్రించే నైపుణ్యం సంపాదించాడు. ఈ క్రమంలోనే అక్టోబరు నెలలోనే గ్రూప్‌-1 పరీక్ష ప్రశ్నపత్రం తస్కరించాడు. అక్టోబరు నుంచి ఇప్పటి వరకు కమిషన్‌ గ్రూప్‌-1, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్, సీడీపీఓ, సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2, ఏఈఈ, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, ఏఈ ఇలా మొత్తం ఏడు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. అక్టోబరు నుంచే ప్రవీణ్, రాజశేఖర్‌ల దందా టీఎస్​పీఎస్​సీ కార్యాలయంలో నడుస్తోందన్న ఆధారాల నేపథ్యంలో మిగతా పరీక్షల ప్రశ్నపత్రాలూ బయటకు తెచ్చి ఉంటారనే అనుమానం కలుగుతోంది.

దీన్ని నిర్ధారించుకునేందుకు సిట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌-1 పరీక్షలో 100 కన్నా ఎక్కువ మార్కుల వచ్చిన వారందర్నీ పిలిచి విచారిస్తున్నట్లు విశ్వపనీయ సమాచారం. ప్రవీణ్, రాజశేఖర్‌ల ఫోన్‌ డేటా ఆధారంగానూ దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధానంగా ప్రవీణ్, రాజశేఖర్‌ల ఫోన్​ కాల్​ ఆధారంగా మరింత మందిని క్షుణ్ణంగా విచారించనున్నారు. ఇప్పటికే నాలుగు పరీక్షలు రద్దు చేయగా.. అవన్నీ ముందుగానే లీక్‌ అయినట్లు కమిషన్‌ నిర్ధారించినట్లేనని భావిస్తున్నారు. ఈ నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంకా ఎవరైనా పొంది ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలితే వారిని ఈ కేసులో నిందితులుగా చేర్చనున్నారు.

ఇవీ చదవండి:

TSPSC పేపర్ లీకేజ్.... గ్రూప్‌-1 ప్రిలిమ్స్ సహా ఆ పరీక్షలు రద్దు

పేపర్ లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్‌సీకి సిట్ నివేదిక

స్వప్నలోక్‌ మృతుల కుటుంబాలకు.. రాష్ట్రప్రభుత్వం బాసట

ABOUT THE AUTHOR

...view details