Prashant Reddy Meeting With Officials : పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలను రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానించినట్లు రహదారుల, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నీటి పారుదలపై సీఎం సమీక్ష అనంతరం ఉమ్మడి నిజామాబాద్ నీటి పారుదలశాఖ అధికారులతో మంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. వానాకాలం పంటకు సాగునీరు అందించే అంశంపై సమీక్షించారు. రైతులకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులకు వానాకాలం సాగుకు ఇబ్బందిలేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
కాళేశ్వరం జలాలను పునరుజ్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నింపి జిల్లా ఆయకట్టుకు నీరు అందించనున్నట్లు చెప్పారు. వర్షం నీరు చుక్క ఎస్సారెస్పీలోకి రాకున్నా.. కాళేశ్వరం జలాలతో సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారని మంత్రి వివరించారు. ఎల్ఎండీ ఎగువ భాగం ఆయకట్టుకు 50 టీఎంసీలు అవసరమని.. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలు రోజుకు అరటీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు.