ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కురిచేడులో జులై 29, 30, 31 తేదీల్లో శానిటైజర్లు తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. తప్పుడు విధానంలో నకిలీ ఫార్మూలా, నకిలీ కంపెనీతో శానిటైజర్లు తయారుచేసి మార్కెట్ చేసిన ప్రధాన నిందితుడితో పాటు, వీటిని విక్రయించిన, సరఫరా చేసిన డీలర్లతో కలిసి 10 మందిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ వెల్లడించారు.
యూట్యూబ్ పరిజ్ఞానంతో శానిటైజర్లు తయారీ
హైదరాబాద్ జీడిమెట్లలో తయారుచేసిన నకిలీ శానిటైజర్లు ఇంతమంది ప్రాణాలు బలిగొన్నాయని ఎస్పీ తెలిపారు. కరోనాతో శానిటైజర్ల వినియోగం పెరగడంతో ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో... శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు ఉన్న అవగాహన, యూట్యూబ్ సాయంతో పర్‌ఫెక్ట్ గోల్డ్ అనే నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ శానిటైజర్ల వల్ల కురిచేడు ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు.
మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం గత 10 రోజులుగా సమగ్ర దర్యాప్తు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందుకోసం 4, 5 శానిటైజర్ల కంపెనీలను పరిశీలించామని, హైదరాబాద్, బెంగళూరు, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో తమ బృందం సమగ్ర దర్యాప్తు నిర్వహించగా, ఇందులో పర్‌ఫెక్ట్ గోల్డ్ కంపెనీ వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. హైదరాబాద్ ప్రశాంత్ నగర్‌కు చెందిన సాలె శ్రీనివాస్ ఆరోతరగతి చదివాడు. అక్రమంగా వీటిని తయారు చేస్తున్నాడని దర్యాప్తులో గుర్తించామన్నారు. గతంలో పెట్రోల్ బంకులో పనిచేసి, కొన్నాళ్లు పెయింట్ రిమూవర్స్ అమ్మడం వంటి పనిచేసిన శ్రీనివాస్‌కు రసాయన ఫార్మూలాల మీద కొంత అవగాహన ఉందన్నారు. ఈ అవగాహనతో కొవిడ్ సమయంలో శానిటైజర్లకు విపరీతమైన గిరాకీ రావడంతో వీటిని తయారు చేయాలని భావించి జీడిమెట్లలో కంపెనీ పెట్టాడని ఎస్పీ తెలిపారు.