Prajapalana In Telangana : ప్రజాపాలన కార్యక్రమం వేళ రాష్ట్రంలో ఊరూవాడ సందడి వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాల (Congress Six Guarantees) అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాలకూ వినతిపత్రాలు, ఫిర్యాదులను తీసుకుంటున్నారు.
Prajapalana Program in Rangareddy : ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమదని, ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్‌తో కలిసి భట్టి (BHatti) ప్రారంభించారు. ఇబ్బందులు లేకుండా ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
"ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానేకాదు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం. ఇళ్లు లేనివారికి ఇళ్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. చాలా ఏళ్లుగా ఇళ్ల కోసం అప్లికేషన్లు వస్తున్నాయి. అందుకోసం ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటరు ఏర్పాటు చేశాము. జనవరి 6వ తేదీ వరకు అప్లికేషన్ తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
మాది దొరల సర్కార్ కాదు, ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి
Minister Ponnam Started Prajapalana in Hyderabad : హైదరాబాద్ రాజేంద్రనగర్ డివిజన్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి, ప్రజలంతా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో పేరుకుపోయిన ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. బంజారాహిల్స్‌లోని సీఎస్టీసీలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam), జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఎలాంటి పైరవీలకు అవకాశం లేదన్న పొన్నం, ప్రజలకు సందేహాలుంటే అధికారులతో సమాచారం తీసుకోవాలన్నారు.