Praja palana Second Day Applications in Telangana: ప్రజాపాలన సదస్సులో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. ఐదు గ్యారెంటీ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల్లో 15,59,276 దరఖాస్తులు వచ్చాయి. మొదటిరోజు 7,46,414 దరఖాస్తులు రాగా శుక్రవారం 8,12,862 వచ్చాయి. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, పట్టణాల్లో 4,89,000 దరఖస్తులు, గ్రామాల్లో 3,23,862 వచ్చాయి.
దరఖాస్తులు తామే ఉచితంగా ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు రూ.20 నుంచి రూ.100 వరకు ఫారాలను అమ్ముతున్నారు. మరోవైపు దరఖాస్తుల్లో నింపాల్సిన అంశాలు, పథకాలకు సంబంధించిన నిబంధనలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అధికారులు ఒక్కొక్కరు ఒక్కోతీరుగా చెబుతుండడం మరింత గందరగోళానికి దారితీస్తోంది.
జీహెచ్ఎంసీలో రెండో రోజు భారీగా అభయహస్తం దరఖాస్తులు - ఎక్కువగా వాటి కోసమే
Second Day Praja palana Applications : ప్రజాపాలనపై రెండో రోజూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నందున ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను(Praja Palana Issues Telangana) పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారని సీఎస్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను శాంతి కుమారి ఆదేశించారు.
రేషన్ కార్డుకు దరఖాస్తులు : అభయహస్తం దరఖాస్తులకు రాజధాని వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ఆహ్వానించిన ఐదు గ్యారెంటీల్లో నగరవాసులు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు పెట్టుకుంటున్నారు. బల్దియాలో ఏర్పాటు చేసిన 600 కేంద్రాల్లో ఎక్కడ చూసినా అర్జీదారులతో కోలాహలం నెలకొంది. అభయహస్తం గ్యారెంటీలకు తోడు రేషన్ కార్డు కోసం ప్రజలు భారీగా దరఖాస్తు(Praja Palana Application) చేసుకుంటున్నారు. తెల్లకాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రేటర్ పరిధి ఆరు జోన్లలో కలిపి 3,13,226 దరఖాస్తులు వచ్చాయి.
కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - ఫామ్స్ లేక ప్రజలకు అగచాట్లు
Praja Palana Program Second Day Response : : ముషీరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా గ్యారెంటీల కోసం, ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పథకానికి ప్రత్యేక దరఖాస్తు అవసరమా అని అధికారుల నుంచి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఫారాల కోసం జిరాక్స్ కేంద్రాలకు జనం పోటెత్తుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో డిమాండ్‌కు సరిపడా అభయాస్తం దరఖాస్తులను సమకూర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.