Praja Palana Programme in Telangana : ప్రజాపాలన కార్యక్రమానికి సాధారణ ప్రజానీకం నుంచి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయహస్తం(Abhaya Hastam) దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగుతుంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి జోన్‌లోని అంజయ్యనగర్, పాపిరెడ్డికాలనీ, మజీద్‌బండలో ప్రజాపాలన కౌంటర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ సందర్శించారు. నాంపల్లిలోని విజయ్‌నగర్ కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మూడురోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు గ్యారంటీల పథకాల కోసం 8.30 లక్షలకు పైగా అర్జీలు వచ్చాయని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తులు చేసుకోవచ్చాని సూచించారు.
రెండు రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కేంద్రానికి మహిళలు, వృద్ధులు బారులు తీరారు. హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్, జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు నాలుగు లక్షల దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు.
ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) హాజరయ్యారు. గత సర్కారు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిందన్న మంత్రి, చేసిన అప్పులు దేనికి వాడాలో కూడా తెలియకుండా ఖర్చు చేశారని ఆరోపించారు.
"పేదవాడి కష్టాలు పట్టించుకోకుండా కేవలం మీ స్వలాభం కోసం మీ ప్రభుత్వం చేసిందని తప్పా పేదవారిని విస్మరించింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. పేదవాడికి ఎక్కడా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. ఈ నియోజకవర్గంలో 900 మందికి మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారు. భవిష్యత్తులో మీ కష్టసుఖాలలో పాలుపంచుకొని ఉంటాము."- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి