Praja Palana Program Ended in Telangana :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన(Congress Party Praja Palana) కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 1,11,46,293 కుటుంబాల పరిధిలో ప్రజాపాలన జరగ్గా, 8 రోజుల్లో 1,24,85,383 అర్జీలు వచ్చాయి. ఒక కుటుంబం ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని ప్రభుత్వం చెప్పినా నిబంధనల్లో స్పష్టత లేక పలు కుటుంబాల నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.
ఐదు గ్యారెంటీ పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, మిగతా అవసరాలకు 19,92,747 వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలు, 3624 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయి. శనివారం ఒక్కరోజే 16,90,000ల దరఖాస్తులు వచ్చాయి. గత నెల 28న ప్రజాపాలన ప్రారంభం కాగా డిసెంబర్ 31, జనవరి 1 సెలవు దినాలు మినహాయిస్తే, ఎనిమిది రోజుల పాటు రెండు పూటలా గ్రామ, వార్డు సభలు జరిగాయి.
Praja Palana Program :హైదరాబాద్ మహానగరంలో అభయహస్తం గ్యారెంటీ దరఖాస్తుల స్వీకరణకు 150 డివిజన్లలో 650 కేంద్రాలను బల్దియా ఏర్పాటు చేసింది. నగరవ్యాప్తంగా 24,74,325 మంది అర్జీలు పెట్టుకున్నట్లు వెల్లడించింది. ప్రజాపాలన చివరి రోజున 3,22,147 దరఖాస్తులు అందినట్లు తెలిపింది. అభయహస్తం 5 గ్యారెంటీల్లో ఎక్కువగా నగరవాసులు మహాలక్ష్మి, గృహాజ్యోతి పథకానికి మొగ్గు చూపగా, రేషన్ కార్డులు కావాలని పెద్దసంఖ్యలో జనం అదనంగా దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏడు రోజుల్లో, మూడు జిల్లాల్లో కలిపి 12,38,000ల పైచిలుకు అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత సర్కార్ కంటే ఈ ప్రభుత్వంపై తమకు విశ్వాసం ఉందని, దరఖాస్తు చేసుకున్న గ్యారెంటీలకు అర్హులుగా గుర్తిస్తుందని దరఖాస్తుదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.