Praja Palana First Day Applications Telangana 2023 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన సదస్సులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. ఐదు గ్యారంటీ పథకాల కోసం నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి. నిన్న 2 వేల 50 పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లోని 2 వేల 10 వార్డుల్లో సదస్సులు జరిగాయి. మొత్తం 17 లక్షల 24 వేల 557 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా, 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి.
గ్రామీణ ప్రాంతాల నుంచి 2 లక్షల 88 వేల 711 దరఖాస్తులు రాగా, జీహెచ్ఎంసీలో లక్షా 98 వేలు, రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2 లక్షల 59 వేల 694 దరఖాస్తులు అందాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని వార్డులు డివిజన్లలో సదస్సులు జరిగాయి. ఉపముఖ్యమంత్రి, మంత్రులు వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం - ఐదు గ్యారంటీల దరఖాస్తులు ఇచ్చేందుకు పోటెత్తిన జనం
గ్రేటర్ హైదరాబాద్‌లోనూ తొలిరోజు దరఖాస్తులు పోటెత్తాయి. బల్దియాలోని 2 లక్షల 39 వేల 739 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా, లక్షా 98 వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో అభయహస్తం గ్యారంటీల పథకాల కోసం లక్షా 73 వేల 262 దరఖాస్తులు రాగా, 20 వేల 714 మంది ఇతర అవసరాల కోసం సమర్పించారు. ఛార్మినార్ జోన్‌లో 43 వేల 798, ఖైరతాబాద్ జోన్‌లో 28 వేల 68, కూకట్పల్లి జోన్‌లో 39 వేల 355, ఎల్బీనగర్ జోన్‌లో 31 వేల 513, సికింద్రాబాద్ జోన్‌లో 31 వేల 414, శేరిలింగంపల్లి జోన్‌లో 19 వేల 828 దరఖాస్తులు అందినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు.
Praja Palana Program First Day Response :రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో 2 వేల 358 వార్డు సభలు నిర్వహించారు. ప్రజాపాలన కోసం పురపాలక కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రజాపాలనపై ప్రజలు, నగర పాలక సంస్థల అనుమానాలు నివృత్తి చేసేందుకు హైదరాబాద్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫిర్జాదిగూడ, బోడుప్పల్, పోచారంలో ప్రజా సదస్సులను పురపాలక శాఖ డైరెక్టర్ హరిచందన పరిశీలించారు.