వారం రోజులక్రితం కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం ఇంకా తేరుకోలేదు. ఆగినట్టే ఆగి.. తిరిగి వర్షాలు కురవడం వల్ల పరిస్థితి తిరిగి ఎప్పట్లాగే మారిపోతుంది. వర్షాల కారణంగా చాలా కాలనీలు, అపార్ట్మెంట్లలో నీళ్లు చేరిపోయాయి. వారం రోజులుగా అనేక కాలనీలు అంధకారంలోనే ఉంటున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 3,041 ఉండగా...17 సబ్ స్టేషన్లలోకి నీరు వచ్చి చేరింది. విద్యుత్ శాఖ రేయింబవళ్లు పనిచేసి.. తిరిగి వాటిని పునరుద్దరించారు. 11కేవీ ఫీడర్లు మొత్తం 15,203 ఉంటే.. వాటిలో 1,080 ఫీడర్లు వర్షం కారణంగా మరమతులకు గురయ్యాయి. వర్షం కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,167 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలోకి నీరు వచ్చి చేరింది. వాటిలో 1,078 డీటీఆర్లకు మరమతులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో సుమారు 22 డీటీఆర్లు ఫెయిల్ అయ్యాయి. ఇంకా 89 ట్రాన్స్ఫార్మర్లు ఉన్న ప్రాంతంలో రెండు నుంచి మూడు ఫీట్ల నీరు నిల్వ ఉండటం వల్ల వాటిని సరి చేయడం విద్యుత్ సిబ్బందికి కష్టసాధ్యంగా మారింది.
ఇంకా తేలలేదు..
జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 37 అపార్ట్మెంట్లలోని సెల్లార్లలో ఇప్పటికీ నీరు అలాగే ఉంది. నీరు తోడేస్తున్నా.. తిరిగి మళ్లీ వస్తోందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. సెంట్రల్ సర్కిల్లోని.. పావని ప్లాజా, యూటవర్స్, 21 సెంచరీ కాంప్లెక్స్, దయాల్ కన్ స్ట్రక్షన్స్, హుస్సేన్ బిల్డింగ్, మహావీర్ హౌస్, శ్రీసాయి కిర్లోస్కర్, గుప్త ఎస్టేట్, శ్రీరామ కాంప్లెక్స్, డైమండ్ టవర్, భగీరథ అపార్ట్మెంట్, హెచ్ఎస్ రెసిడెన్సీ, అక్బర్ పుర అపార్ట్మెంట్స్. సికింద్రాబాద్ సర్కిల్లోని విశ్వరూప అపార్ట్మెంట్స్, మోడల్ టవర్స్, ప్రవీణ్ కుమార్ అండ్ అదర్స్, జయనిలయం, మణికంఠ క్రౌన్, నారాయణాద్రి, విజయ్ శ్రీ నిలయం, అన్నపూర్ణ కాంప్లెక్స్, అనురాగ్ కాంప్లెక్స్, అనురాగ్ హాస్పిటల్స్, పాకాల ప్లాజా, పద్మజా అపార్ట్ మెంట్, ఎన్7 ఫంక్షన్ హాల్. సైబర్ సిటీ సర్కిల్లోని ఇంధ్రప్రస్థ విల్లా అపార్ట్మెంట్స్, శాంభవి అపార్ట్మెంట్స్, హబ్సిగూడ సర్కి ల్లోని గౌస్ ఖాన్, టీవీకే రెడ్డి, సెయింట్ జోసెఫ్ స్కూల్, ఓం సాయి కన్స్ట్రక్షన్స్, వాయు విహార్ కన్స్ట్రక్షన్, శక్తి శ్రీరామ్, సనా గార్డెన్ అపార్ట్మెంట్లలో ఇంకా భారీగా వర్షపు నీరు ఉంది.