తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2021, 7:15 PM IST

ETV Bharat / state

'విద్యుత్​ సవరణ బిల్లును ఉపేక్షించం... ఆగస్టు 10న మెరుపు సమ్మె'

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు -2021ని ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్న వేళ.....రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు ప్రత్యక్ష ఆందోళనల బాట పట్టనున్నారు. ఆగస్టు 10న మెరుపు సమ్మెకు దిగుతామని విద్యుత్ సంఘాలు తెలిపాయి.

Electricity Amendment bill
Electricity Amendment bill

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లును ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విద్యుత్ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఈనేపథ్యంలో బిల్లును వ్యతిరేకిస్తూ... రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. గతంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియ చేశాయి. దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల టీఎస్​పీఈఏ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ధర్నాలు చేపట్టాయి. విద్యుత్ సవరణ బిల్లు సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్నాయని... వ్యవసాయశాఖ, పేద గృహ వినియోగదారులకు ప్రైవేటీకరణ ద్వారా అధిక భారం పడుతుందని, ఛార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఆగస్టు 10న సమ్మెలోకి..

వివిధ సంఘాల విద్యుత్ ఉద్యోగులు ఇప్పటికే జేఏసీగా ఏర్పడి... విద్యుత్ సవరణ బిల్లుపై ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఇంజినీర్లు అందరూ సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో ట్రాన్స్ కో-జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఆగస్టు 10న తేదీన విధులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని యాజమాన్యానికి కూడా చెప్పామన్నారు.

ఉపేక్షించేది లేదు..

తెలంగాణ వ్యాప్తంగా జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ల పరిధిలో ఉన్న విద్యుత్ ఉద్యోగులు సైతం విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు వస్తే.. క్రమంగా విద్యుత్ శాఖ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అది విద్యుత్ వ్యవస్థ ఉనికికే ప్రమాదమని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టొద్దని ఉద్యోగులు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సవరణ బిల్లుపై నిరంతర పోరాటం సాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు తెలిపారు.

ఇప్పటికైనా స్పందించండి

విద్యుత్ సవరణ బిల్లుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని విద్యుత్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి... విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:"విద్యుత్‌ సవరణ బిల్లు'తో తీరని నష్టం"

ABOUT THE AUTHOR

...view details