భారీ వర్షాల కారణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పవర్‌గ్రిడ్‌ను మెయింటైన్ చేస్తున్నామని ట్రాన్స్‌జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. కొత్తగూడెం ప్లాంట్‌లో నీరు చేరిందని... అయినప్పటికీ ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. వర్షాలు కురుస్తున్న సమయంలో స్తంభాలు, విద్యుత్ తీగలను ఎవరూ తాకొద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో అదనపు సిబ్బందిని కూడా నియమించినట్లు ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. వచ్చే 3రోజులు కూడా అతిభారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇంజినీర్లకు జాగ్రత్తలు తీసుకోవాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామరెడ్డి సూచించారు. అన్ని సబ్స్టేషన్లలో అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు మెటీరియల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు.
electricity: వర్షాలు వస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి: విద్యుత్‌శాఖ - ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చర్యలు చేపట్టింది.
మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ సన్నద్దమవుతుంది. వరదలు, వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశముంది. నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసితులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణానికే ముప్పు వస్తుంది. శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన కరెంటు తీగలు, వదులుగా ఉన్న స్విచ్ బోర్డులు ఇలా అన్ని చోట్లా ముప్పు పొంచి ఉంటుంది.
- తడి చేతులతో ఎట్టిపరిస్థితుల్లోను స్విచ్‌లు వేయకపోవడం మంచిది..
- తడిగా ఉన్నప్పుడు విద్యుత్ పరికరాలు తాకొద్దు.
- సాధ్యమైనంతవరకు పిల్లలకు అందనంత ఎత్తులో స్విచ్‌బోర్డులు ఏర్పాటు చేయాలి.
- దుస్తులు ఆరవేసినప్పుడు విద్యుత్ తీగలకు దూరంగా వేయాలి.
- శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి... అధికారులకు సమాచారం అందించాలి.
- ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉండడం గమనిస్తే వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
- విద్యుత్ నియంత్రికలకు దూరంగా ఉండాలి.
- విద్యుత్ మరమ్మతులు వచ్చినప్పుడు సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించకూడదు.
- విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి(హీటర్లు, గీజర్లు...)
- విద్యుత్ ఉపకరణాలపై వర్షం నీరు పడకుండా చూసుకోవాలి.
ఇదీ చూడండి:RAINS IN TELANGANA: రాష్ట్రంలో వరుణ ప్రతాపం.. వరద నీటితో ప్రజల పాట్లు