తెలంగాణ

telangana

ETV Bharat / state

Power Cuts in AP: పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా... కారణమేంటంటే..? - AP power issue

Power Cuts in AP: ఆంధ్రప్రదేశ్​లోని థర్మల్‌ ప్లాంట్లలో సాంకేతిక లోపాలతో విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. విద్యుత్ లోడ్‌ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు దఫాలుగా సరఫరాకు కోత పెట్టారు. ప్రతి గ్రామానికీ కనీసం 2 గంటల పాటు రొటేషన్‌ పద్ధతిలో కరెంటును నిలిపివేశారు. పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకూ కోతలు విధించారు.

Power cuts in AP
విద్యుత్ సరఫరా

By

Published : Feb 4, 2022, 11:01 AM IST

Power Cuts in AP: ఏపీలోని రెండు థర్మల్‌ ప్లాంట్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో లోడ్‌ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫాల వారీగా విద్యుత్తు సరఫరాకు కోత పెట్టారు. ప్రతి గ్రామానికీ కనీసం 1-2 గంటల పాటు రొటేషన్‌ పద్ధతిలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో పాటు.. పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకూ కోతలు విధించారు.

ఏపీ జెన్‌కోకు చెందిన కృష్ణపట్నం 800 మెగావాట్లు, విజయవాడ వీటీపీఎస్‌లో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌లో లీకేజీ రావడంలో గురువారం ఉదయం నుంచి ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచింది. ఇదే సమయంలో విశాఖలోని సింహాద్రి థర్మల్‌ ప్లాంటు నుంచి 400 మెగావాట్ల ఉత్పత్తి కూడా నిలిచింది. ఈ కారణంగా గ్రిడ్‌కు వచ్చే సుమారు 1,700 మెగావాట్లు తగ్గింది. ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ సుమారు 194 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో కోతలు విధించక తప్పలేదు.

పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కూడా విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. లోడ్‌ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో రొటేషన్‌ విధానంలో కోతలు పెట్టారు. దీనికితోడు కడప ఆర్‌టీపీపీలో 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడో యూనిట్‌, వీటీపీఎస్‌లో 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మొదటి యూనిట్‌ను నిర్వహణ కోసం ఉత్పత్తి నిలిపేశారు. దీంతో డిమాండ్‌ మేరకు సర్దుబాటు సాధ్యం కాలేదు.

ఎన్నికల ప్రభావంతో దొరకని విద్యుత్‌

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 194 ఎంయూలు కాగా థర్మల్‌ యూనిట్లలో సాంకేతిక లోపంతో సుమారు 5-6 ఎంయూల లోటు ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలుకు ప్రయత్నించినా యూనిట్‌ రూ.15 వరకు ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అధిక ధర వెచ్చించి అక్కడి ప్రభుత్వాలు కొంటున్నాయి. ఎక్కువ ధర చెల్లించి కొనేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

వివిధ జిల్లాల్లో కోతలు

  • ప్రకాశం జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల సాయంత్రం 4 నుంచి రాత్రి 8.15 వరకు సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల రెండు గంటలపాటు కరెంటు తీసేశారు.
  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చాలాచోట్ల సాయంత్రం 5 నుంచి, కొన్ని ప్రాంతాల్లో 5.30 నుంచి కరెంటు తీసేశారు. రాత్రి 8-9 గంటల వరకూ రాలేదు.
  • విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ రెండు గంటలకుపైగా తీసేశారు.
  • తూర్పుగోదావరి జిల్లాలో పలు మండలాల్లో విద్యుత్‌ కోతలు విధించారు. కాకినాడ నగరం, గ్రామీణ మండలాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి రెండు గంటలపాటు కరెంటు లేదు.
  • నెల్లూరు, కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్‌ కోత విధించారు.

సాంకేతిక సమస్యతో కొరత

ఎన్టీపీసీలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం 800 మెగావాట్ల కొరత తలెత్తిందని, అందుకే ఐదు జిల్లాల పరిధిలో విద్యుత్తు కోతలు విధించాల్సి వచ్చిందని ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు తెలిపారు. అయితే, తమ పరిధిలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని ఎన్టీపీసీ వర్గాలు తెలిపాయి

ఇదీ చదవండి:దేశంలో తగ్గిన కరోనా కొత్త కేసులు.. 5లక్షలు దాటిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details