లాక్డౌన్లో ప్రజలందరూ ఇళ్లలోనే ఉన్నందునే కరెంట్ వినియోగం పెరిగిందన్న విద్యుత్ సంస్థల మాటలు ఇప్పుడు తప్పని తెలుస్తోంది. గతేడాది(2019) మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రజలకు వాడుకున్న విద్యుత్ ప్రకారం అవే బిల్లులను ఈ ఏడాది లాక్‌డౌన్‌లోనూ ఏప్రిల్, మే నెలల్లో జారీ చేశారు. లాక్డౌన్ సడలింపుతో ఈ నెల మొదటివారంలో ఇళ్లకెళ్లి విద్యుత్ సిబ్బంది మీటరు రీడింగ్ తీశారు ఇందులో నమోదైన యూనిట్ల ప్రకారం గత మూణ్నెల్లకు నెలవారీగా సగటు యూనిట్ల చొప్పున లెక్కించి ఈ నెల మొదటివారంలో బిల్లులను డిస్కంలు జారీ చేశాయి. ఈ లెక్కలతో శ్లాబులు మారిపోయి బిల్లులు పెరిగాయని తేలింది.
ఎలా తగ్గిందంటే..
* రాష్ట్రంలో గతేడాది(2019) మే నెలలో మొత్తం 85.89 లక్షల ఇళ్ల కనెక్షన్లకు 143.10 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగమైంది. అంటే ఒక్కో కనెక్షన్‌కు 166.60 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లు అర్థం. ఆ నెలలో రూ.796.56 కోట్లను బిల్లుల రూపంలో రెండు డిస్కంలు వసూలు చేశాయి.
* ఈ ఏడాది(2020) మే నెలలో మొత్తం 89.29 లక్షల ఇళ్ల కనెక్షన్లకు 135.32 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగమైంది. సగటున ఒక్కో కనెక్షన్‌కు 151.53 యూనిట్లు. గతేడాది మే నెలలో కాల్చిన సగటు 166.60కన్నా ఈ ఏడాది అదే నెలలో 15 యూనిట్లు తక్కువ వినియోగించారు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లలో ఉన్నారు. పైగా ఈ ఏడాది 3.40 లక్షల కనెక్షన్లు పెరిగాయి.
* గతేడాది మే నెలలో కాల్చిన 143.10 కోట్ల యూనిట్ల కన్నా ఈ ఏడాది మేలో 7.78 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగం తగ్గిందని మీటర్ రీడింగ్ లెక్కల ద్వారా తేలింది.