ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై ప్రభుత్వ వైఖరిని హైకోర్టు ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి దుస్థితిపై గతంలో దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో వేర్వేరు వాదనలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. భవనాలు కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఓ వాదన ఉండగా.. పురాతన భవనం కాబట్టి కూల్చవద్దని మరో వాదన ఉందని తెలిపింది.
పురోగతి పనుల సంగతేమిటి ?
ఉస్మానియా ఆస్పత్రి కూడా ఎర్రమంజిల్ మాదిరిగా పురావస్తు భవనమా అని హైకోర్టు ఆరా తీసింది. ఈ విషయంలో ప్రభుత్వ విధానమేంటని హైకోర్టు విచారించింది. ఆస్పత్రి భవన ప్రాంగణం పరిధి పురావస్తు నిర్మాణాన్ని విడిచి పెట్టి మిగతా భవనాలకు మరమ్మతుల కోసం ఇప్పటికే 6 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పనుల పురోగతిపై కోర్టు వివరణ అడగగా... ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని వివరిస్తామని న్యాయవాది బదులిచ్చారు. అంగీకరించిన హైకోర్టు.. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ ఆగస్టు 4కి వాయిదా వేసింది.
ఇవీ చూడండి : నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్