తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికలు వస్తున్నాయ్ బాస్ - పోస్టల్ ఓటు జాగ్రత్తగా వేయ్

Postal Ballot Votes in Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు విస్తరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తేలిసిందే. అత్యవసర సేవల్లో ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే పోస్టల్ ఓటు వినియోగించుకునే వారిలో ఎక్కువశాతం తప్పులు దొర్లుతున్నాయి. ఆ చెల్లని ఓట్లే చాలామంది అభ్యర్థుల గెలుపోటముల మీద ప్రభావం చూపుతున్నాయి. పోస్టల్ ఓటు వినియోగంలో ఏం తప్పులు చేస్తున్నామో ఓ లుక్కేదాం..

Postal Ballot Votes in Telangana
Postal Ballot Votes

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 3:16 PM IST

Updated : Nov 24, 2023, 6:12 AM IST

Postal Ballot Votes in Telangana : పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటరుతో ఓటు వేయించే సిబ్బంది.. తమ సొంత ఓటు వినియోగించుకోవడంలో తడబడుతున్నారు. పోస్టల్‌ ఓటు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న సిబ్బంది వేస్తున్న ఓట్లు పెద్దసంఖ్యలో చెల్లట్లేదు. ఆ చెల్లని ఓట్లే చాలామంది అభ్యర్థుల గెలుపోటముల మీద ప్రభావితం చూపుతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తిలో గెలుపోటముల మధ్య తేడా కేవలం 78 ఓట్లు మాత్రమే. ఆ ఎన్నికలో 1148 పోస్టల్‌ ఓట్లను లెక్కించగా.. వాటిల్లో 519 చెల్లకుండా పోయాయి. అదే ఎన్నికలో ఏపీలోని మంగళగిరిలో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం 12 ఓట్లు మాత్రమే. అక్కడ 1051 పోస్టల్‌ ఓట్లు లెక్కించగా.. అందులో 59 ఓట్లు చెల్లలేదు.

Many Postal Ballot Votes Invalid in Election :ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌లో గెలుపోటముల మధ్య తేడా 25 ఓట్లు. ఇక్కడ లెక్కించిన 627 పోస్టల్‌ ఓట్లలో.. 319 ఓట్లు చెల్లలేదు. 2009లో ముథోల్‌లో గెలిచిన అభ్యర్థి ఆధిక్యం 183 ఓట్లు మాత్రమే. ఆ స్థానంలో 554 పోస్టల్‌ ఓట్లను లెక్కించగా.. 454 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్రంలో 2018 ఎన్నికల్లో డోర్నకల్‌, జూబ్లీహిల్స్, సనత్​నగర్, ఖైరతాబాద్, నిర్మల్ తదితర 20 నియోజకవర్గాల్లో చెల్లని పోస్టల్ ఓట్లు 10 శాతానికి పైగా నమోదయ్యాయి. ఎందుకిలా జరుగుతున్నాయి? ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చే సమయంలోనే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballot) వినియోగంపై అవగాహన కల్పిస్తారు. అయినా పొరపాట్లు, నిర్లిప్తత కారణంగా పలు ఓట్లు తిరస్కరణకు గురవుతున్నాయి.

పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త రూల్

గత కొన్ని ఎన్నికల్లో లెక్కించిన పోస్టల్ ఓట్లు.. వాటిలో చెల్లనివి :

సంవత్సరం రాష్ట్రం లెక్కించినవి చెల్లనివి శాతం
2018 తెలంగాణ 1,02,244 6,355 6.23
2019 ఏపీ 2,95,003 56,545 19.17
2014 ఉమ్మడి ఏపీ 3,14,483 48,658 15.48
2009 ఉమ్మడి ఏపీ 1,97,939 36,158 18.26
2004 ఉమ్మడి ఏపీ 75,607 8,509 11.26
  • ఓటరు జాబితా(Voter List)లో ఉన్న ప్రకారం డిక్లరేషన్‌ పత్రంపై.. ఉద్యోగి పూర్తి పేరు, చిరునామా, బ్యాలెట్‌ పత్రంలో ఉన్న సీరియల్‌ నంబరు రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏవైనా తప్పులు దొర్లితే ఆ ఓటును పరిగణించరు.
  • డిక్లరేషన్‌ పత్రంపై కచ్చితంగా గెజిటెడ్‌ అధికారి సంతకం చేయించాలి. పలువురు సిబ్బంది ఆ సంతకం లేకుండానే పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటు వేస్తున్నారు.
  • ఉద్యోగుల డిక్లరేషన్‌ పత్రాన్ని గులాబీ రంగు కవర్‌లో.. బ్యాలెట్‌ పత్రాన్ని నీలం రంగు కవర్‌లో అందజేస్తారు. ఓటు వేశాక.. ఆ పత్రాల్ని అవే కవర్లలో ఉంచి సీల్‌ వేయాల్సి ఉంటుంది. కొందరు తారుమారు చేస్తూ.. డిక్లరేషన్‌ పత్రాన్ని నీలం కవర్‌లో, బ్యాలెట్‌ పత్రాన్ని గులాబీ కవర్‌లో ఉంచి సీల్‌ వేస్తున్నారు. మరికొందరైతే ఆ పత్రాలకు సీల్‌ కూడా వేయడం లేదు. అలా వేసిన వారిని తిరస్కరిస్తారు.
  • నచ్చిన అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్‌ పత్రంలో నిర్దేశించిన గడి(బాక్స్‌)లోనే 'టిక్‌' మార్క్‌, లేదా 'క్రాస్‌' మార్క్‌ వేయాలి. గడి దాటి బయటకు వెళ్లిన మార్కును ఓటుగా పరిగణలోకి తీసుకోరు. మరికొందరు తమకు నచ్చిన అభ్యర్థి గడిలో 'టిక్‌' మార్కు వేసి.. నచ్చని అభ్యర్థుల గడుల్లో 'క్రాస్‌' గుర్తులు పెడుతున్నారు. ఇలాంటి పోస్టల్‌ ఓట్లను పరిగణించరు.
  • ప్రస్తుత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) సుమారు 4.50 లక్షల మంది పోలింగ్‌ అధికారులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, మిలిటరీ ఉద్యోగులకే పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉండేది. ఈసారి ఎయిర్‌పోర్టు, రైల్వే, ఆల్‌ ఇండియా రేడియో, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, వైద్యారోగ్య, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, అగ్నిమాపక శాఖ, మీడియా, విద్యుత్, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్‌సీఐ శాఖల ఉద్యోగులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని ఈసీ కల్పించింది.

Postal Ballot for 13 Another Departments Employees : మరో 13 శాఖల ఉద్యోగులకూ 'పోస్టల్ బ్యాలెట్'.. ఇకపై ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగం

పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సర్వం సిద్ధం - పోలింగ్​కు ముందుగానే ఓటేసే అవకాశం

Last Updated : Nov 24, 2023, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details