Postal Ballot Utilization in Telangana Assembly Elections 2023 :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 28,057 మందికి అనుమతించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు గుర్తింపు పొందిన జర్నలిస్టులు(Journalists), ఎన్నికల విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, దివ్యాంగులు తదితరులకు కలిపి మొత్తం 13 విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఈసీ కల్పించింది.
పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త రూల్
44,097 మంది 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసినప్పటికీ వాటిని పరిశీలించి 28,057 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో అత్యధికంగా సిద్ధిపేటలో 752 మంది ఉండగా, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 లోపు మంది ఉన్నారు. నవంబర్ 30న పోలింగ్ ఉండటంతో అంతకు ముందుగానే వీరు ఓటు హక్కు(Right to vote) వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.
New Polling Stations Arrangements in Telangana : అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియటం.. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారు కావడంతో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం 7ఏలు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఈఓ(CEO) సత్యవాణి తెలిపారు. అందుకు అనుగుణంగా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. శనివారం సాయంత్రం నాటికి ముద్రణ పూర్తవుతుందని.. గురువారం సాయంత్రం నుంచి చంచల్‌గూడ ప్రభుత్వ ముద్రణాలయంలో ప్రింటింగ్ ప్రారంభమైనట్లు సత్యవాణి తెలిపారు.