Postal Ballot for 13 Another Departments Employees : అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు విస్తరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల్లో(Emergency Services) ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది. గతంలో ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ విధానం ప్రకారం.. పోస్టల్లో వచ్చిన బ్యాలెట్ ఓటును సిబ్బంది తమ వద్దే ఉంచుకొని రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్లు కలిగిన వారు ఒక్కో మారు ఎన్నికల ఫలితాన్ని నిర్ధేశించే పరిస్థితి ఏర్పడుతుంది. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన ఈసీ.. ఈ విధానంలో మార్పులు, చేర్పులు చేసింది.
ఈసీ అవకాశం కల్పించిన శాఖలు వరుసగా..:ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే(Indian Railway), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్ర రవాణా సంస్థ, పౌర సరఫరాల శాఖ, బీఎస్ఎన్ఎల్, పోలింగ్ కవరేజ్ కోసం ఈసీఐ ధ్రువీకరించిన మీడియా ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ శాఖలు, విభాగాలకు చెందిన వారు పోలింగ్ రోజు విధుల్లో ఉంటే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వర్తిస్తుంది.
పాత్రికేయులకు ఇక పోస్టల్ బ్యాలెట్.. ఆ ఉద్యోగులకు కూడా...
Method of Using Postal Ballot : ఇందుకోసం ఆయా శాఖలు, విభాగాల్లో నోడల్ అధికారులను(Nodal Officers) నియమిస్తారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే వారు 12 డీ ఫారంలో వివరాలు పొందుపర్చి నోడల్ అధికారులకుఇవ్వాల్సి ఉంటుంది. నోడల్ అధికారి వాటిని పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పంపిస్తారు. ఈ తరహాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలనుకునే వారి ఫారం 12 డీ పూర్తి వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి ఐదు రోజుల్లోపు రిటర్నింగ్ అధికారికి చేరాల్సి ఉంటుంది. వాటిని ఆర్ఓ పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తారు.