అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక తపాలా సేవలు దాదాపు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఊళ్లలో పోస్ట్‌మాన్ కోసం ఎదురు చూసేవాళ్లు.. ఏ సమాచారం రావాలన్నా... చేరవేయాలన్నా.. అతడే ఆధారం. రానురాను ఆ అవసరం పూర్తిగా తగ్గిపోయింది. పార్సిల్ సర్వీసుల విషయంలోనూ ప్రైవేట్ కొరియర్లు మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించారు. అయినా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తపాలా శాఖ ప్రయత్నించింది. ప్రభుత్వ పథకాల నగదు చెల్లింపులతోపాటు పల్లెల్లో బ్యాంకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం కరోనా సమయంలోనూ తపాలా శాఖ మన్ననలు అందుకుంటోంది. నిరంతరాయంగా సేవలందిస్తోంది.
ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లు
ప్రస్తుతం పలు రకాల పార్సిల్స్ రవాణాకు తపాలా శాఖే ఆధారమైంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు పార్సిళ్లు చేరవేస్తోంది. లేఖలు, మనీయార్డర్, స్పీడ్ పోస్టు, పార్సిల్ బుకింగ్ సేవలు యథాతథంగా నడుస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వైద్య సేవలకు సంబంధించిన సరంజామాను తపాలా శాఖ శరవేగంగా చేరవేస్తోంది. అంతర్రాష్ట్ర, మెట్రో నగరాలు, మారుమాల ప్రాంతాల్లోని ఆస్పత్రులు, ఆరోగ్య ఉప కేంద్రాలకు ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లు, వైద్యసిబ్బందికి రక్షణ పరికరాలను సకాలంలో అందజేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్ర వైద్యసదుపాయాల మౌలికాభివృద్ధి సంస్థ 3 వేల 5 వందల టన్నుల విలువ చేసే ఔషధాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరవేయడానికి తపాలాశాఖనే ఎంచుకుంది.