తెలంగాణ

telangana

ETV Bharat / state

Jawan Sai Tej: సాయితేజ మృతదేహం గుర్తింపు.. నేడు స్వస్థలానికి!

Jawan Sai Tej : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. నేడు స్వగ్రామం ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరనుంది. భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Jawan Sai Tej
జవాన్ సాయి తేజ అంత్యక్రియలు

By

Published : Dec 11, 2021, 9:27 AM IST

Funeral of Jawan Sai Teja: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన లాన్స్‌నాయిక్‌ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించామన్న ఆర్మీ అధికారులు.. విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నట్లు వెల్లడించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేడు స్వగ్రామం ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరనుంది. భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Jawan Sai Teja Life Journey:దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో.. సాయితేజ అహోరాత్రులు శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి.. త్రిదళపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు. రావత్ భద్రతా బృందంలో చోటు సంపాదించారు. కానీ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఈ తెలుగుతేజం.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు.

2012లో ఆర్మీ సిపాయిగా చేరిన సాయితేజ... కొంతకాలం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తించారు. ఏడాది తర్వాత పారాకమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ఎంపిక నుంచి శిక్షణ వరకు అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొని పారాకమాండో అయ్యారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టికరిపించే ట్రూపర్‌గా... నైపుణ్యం సాధించారు. కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చేస్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే సాయితేజలోని సామర్థ్యాన్ని గుర్తించిన రావత్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. సాయితేజకు ఐదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కుమార్తె దర్శిని ఉన్నారు. రావత్​కు వ్యక్తిగత సిబ్బందిగా చేరాక సాయితేజ దిల్లీలోనే ఉంటున్నారు. ఏడాది క్రితం తన కుటుంబాన్ని మదనపల్లెకి మార్చారు. ఈ ఏడాది వినాయక చవితికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని గంటల ముందు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం కొద్దిసేపటికే సాయి మరణవార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సాయితేజ మృతి అతని స్వగ్రామంలో తీరని విషాదాన్ని నింపింది. యువకెరటం మృతి ఎంతో బాధాకరమని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

లాన్స్ నాయక్ సాయితేజ అకాల మరణం.. అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన సాయితేజ... ఆకస్మికంగా తనువు చాలించడం.. అందరినీ కలచివేసింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉంటూ.. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అనుకోని ప్రమాదంలో సాయితేజ ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్ర విషాదంలోకి నెట్టిందని కుటుంసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీచదవండి:'వీరుడా వందనం'.. రావత్​కు జనభారతం తుది వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details