Vijayakumar Portraits received recognition at G20 : విశ్వనగరం హైదరాబాద్ వేదికగా విజయవంతంగా జరిగిన జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాల్లో చిరుధాన్యాల సాగు, వినియోగం, వ్యాప్తిపై విస్తృత చర్చ సాగింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన చిత్రకారుడు మోకా విజయకుమార్ వినూత్న రీతిలో ఆలోచించారు. తన సృజనకు పదను పెట్టి చిరుధాన్యాలతో అద్దిన చిత్రాలను అతిధులకు అందజేశారు.
Special Story On Vijayakumar Portrait Painting :తన కళకు ఓ ప్రత్యేకత ఉండాలన్న లక్ష్యంతో తన చేతుల నుంచి జాలువారిన చిరుధాన్యాలు అద్ది అద్భుతంగా తీర్చిదిద్దిన కళాఖండాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర సహాయ మంత్రులు కైలాష్‌చౌదరి, శోభ కరంద్లాజేకు స్వయంగా అందజేశారు. భారత్ ఆహ్వానం మేరకు జీ-20 సదస్సుకు హాజరైన పలు దేశాల వ్యవసాయ మంత్రులకు తన వేసిన చిరుధాన్యాల చిత్ర పటాలు అందజేశారు. ఆ చిత్ర పటాలు స్వీకరించిన తోమర్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మొత్తం 35 మంది ప్రతినిధులు అబ్బురపడ్డారు. విజయకుమార్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. సమకాలీన, వర్తమాన అంశాలపై చిత్రాలు గీసే తాను ఎంచుకున్న చిరుధాన్యాలతో రూపొందించిన చిత్ర పటాలు ప్రపంచ ప్రముఖులకు అంజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Vijayakumar Paintings in G20 Meeting :సహజ సిద్ధంగా వృత్తి రీత్యా విశాఖపట్నంలో రైల్వే శాఖలో గ్రేడ్-1 పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న విజయకుమార్.. ప్రవృత్తి రీత్యా కళాకారుడు. పోర్ట్రెయిట్ అనేది పెయింటింగ్‌లో ఒక అద్భుతమైన శైలి కావడంతో అది అందిపుచ్చుకుని 2017 నుంచి తానా వంటి సంస్థల ఆహ్వానం మేరకు ఏటా అమెరికాలో ఓ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. 2018 మే మాసంలో అట్లాంటాలో ఓ ఆర్ట్ ఈవెంట్ ద్వారా 200 మంది చిన్నారులకు చిత్ర కళపై శిక్షణ ఇచ్చారు.
Vijayakumar Painting CM KCR and KTR with small grains : 2000 మేలో కాపిటల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు సొసైటీ నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ.. కరోనా మహమ్మారి వల్ల వెళ్లలేకపోయారు. 2022లో న్యూజెర్సీలో తొలిసారిగా తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు వెళ్లి నిర్వహించిన పోర్ట్రెయిట్ పెయింటింగ్ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో విశాఖ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో దిగ్గజ కంపెనీలైన రిలయెన్స్, అదానీ, గూగుల్, విప్రో, యాపిల్, గోద్రెజ్, మహింద్రా, మైక్రోసాఫ్ట్, టాటా తదితర 12 కంపెనీల సీఈఓల చిత్ర పటాలు చిరుధాన్యాలు అద్ది రూపొందించినవి ప్రదర్శించారు. తన భర్త విజయకుమార్‌ను చూసి ఆయన సతీమణి సునీత కూడా తన వంతు సహకారం అందిస్తూ వస్తుంది. తాను కూడా కళకారిణిగా రాణిస్తూ విశాఖలో ఆర్ట్స్ స్కూల్ నిర్వహిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలు కూడా చిరుధాన్యాలతో అద్ది అందంగా రూపొందించినవి సమయం ఇస్తే స్వయంగా కలిసి ఇవ్వాలని చూస్తున్నామని సునీత తెలిపారు.