తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటోనే ఆవాసం... ఆకలితో సావాసం... - poor people situation in rajamahendravaram

అసలే అనారోగ్యం... ఆపై నా అనే వారు లేకపోవడం... ఆ మహిళకు శాపంగా మారింది. చూసే దిక్కు లేక... ఉండటానికి ఇళ్లు లేక... ఆమెకు ఆటోనే ఆవాసమైంది. నిత్యం ఆకలితో పోరాటం చేస్తూ దయనీయ స్థితిలో అందులోనే కాలం వెళ్లదీస్తోంది. ఇంతలో అధికారులు ఆమె ఉంటోన్న ఆటోను తీసేస్తామని చెప్పారు. ఏమీ పాలుపోలేని ఆ మహిళ తనను ఆదుకునే ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది.

ఆటోనే ఆవాసం... ఆకలితో సావాసం...

By

Published : Nov 17, 2019, 1:48 PM IST

రాజమహేంద్రవరం శేషయ్యమెట్టలోని రహదారి పక్కనే ఓ పాత ఆటో ఉంది. అందులోకి తొంగి చూస్తే మూలుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ మహిళ కనిపిస్తుంది. లేవలేని స్థితిలో బక్కచిక్కి ఉన్న ఆమె పేరు రాజేశ్వరి. గతంలో వీరి కుటుంబం మేదరపేటలో నివాసం ఉండేది. ఆమె భర్త, కుటుంబ సభ్యులు అందరూ చనిపోవడం వల్ల ఆమె దిక్కులేనిదైంది.

రాజేశ్వరికి మిగిలింది తన అత్త మాత్రమే. వయసు మీద పడడం వల్ల ఆమెకు కూడా చూపు మందగించింది. ఉన్న కొద్దిపాటి ఓపికతోనే తన కోడలికి చేతనైనంత సాయం చేస్తూ... ఆమె కూడా అక్కడే నివసిస్తోంది. స్థానికులు ఎవరైనా జాలిపడి ఆహారం అందిస్తే రాజేశ్వరి తింటుంది. లేకుంటే పస్తులుంటుంది. కొందరు మహిళలు ఆమె దుస్థితి చూసి తోచిన సహాయం చేస్తున్నారు.

సహాయం కోసం ఎదురుచూపులు

రహదారికి అడ్డంగా ఉందని ఆమె ఉంటోన్న ఆటోను అధికారులు తీసేస్తామని చెప్పారు. దిక్కుతోచని స్థితిలో దీనంగా కాలం వెళ్లదీస్తోన్న రాజేశ్వరికి ఇది మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అనారోగ్యంతో ఉన్న తనకు ఎవరైనా వైద్యం అందించి..ఆవాసం కల్పించాలని కన్నీటితో వేడుకుంటోంది. ఎండ, వర్షంలోనూ రాజేశ్వరి ఆటోలోనే ఉంటూ ఇబ్బందులు పడుతోందని ఆమె అత్త వీరమ్మ చెబుతోంది. ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని దీనంగా వేడుకుంటుంది. ఆటోను ఆవాసంగా మార్చుకుని కాలం వెళ్లదీస్తున్న రాజేశ్వరి... ఆపన్నహస్తం అందించే వారి కోసం దీనంగా ఎదురుచూస్తోంది.

ఆటోనే ఆవాసం... ఆకలితో సావాసం...

ఇదీ చూడండి:'వృక్ష సంరక్షణే' మానవుని ఆసలైన సంపద

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details