తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2020, 11:07 AM IST

ETV Bharat / state

విద్యావంతులున్నా... ఓట్లేయడం లేదు

లవబుల్‌... లివబుల్‌ సిటీగా రూపుదిద్దుకుంటున్న నగరం... హైదరాబాద్‌. ఎన్నోవేల ఉన్నత సంస్థలకు... లక్షల మంది ఉద్యోగుల కలల నగరం. ఇక్కడి ప్రజల్లో అత్యధికులు విద్యావంతులు. పెద్ద పెద్ద చదువులతో... వేలు, లక్షలు సంపాదించే ఉన్నత ఉద్యోగులు ఉంటారు. కానీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మాత్రం... భాగ్యనగరం ఎంతో వెనుకబడిపోయింది. ఇప్పుడు ఇదే విషయం... చర్యనీయాంశమవుతోంది. ఒకవైపు పార్టీ అభ్యర్థులకు, మరోవైపు ఎన్నికల సంఘానికి ఓటింగ్‌ శాతాన్ని పెంచడం తక్షణ కర్తవ్యం అయ్యింది.

ghmc
ghmc

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మేయర్‌ పీఠం తమదంటే... తమదంటూ అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రకటనలిచ్చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ వరకు అన్నింటినీ ప్రణాళిక ప్రకారం చేస్తోంది. కానీ.... ప్రతిష్ఠాత్మక గ్రేటర్‌ ఎన్నికల్లో ఎంత మంది నగర ప్రజలు ఓటు వేయకుండా ఉండిపోతారోననే కలవరపాటు ఎక్కువైంది. ఇందుకు గతంలో నమోదైన ఓటింగ్‌ శాతమే కారణం. పేరుకు విద్యావంతుల నగరమే అయినా... ఓటు వేసేందుకు మాత్రం ఇక్కడి పౌరులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం గత కొన్నేళ్ల ఎన్నికల సరళిని గమనిస్తే స్పష్టమవుతుంది.

వాళ్లంతా ఓటింగ్​కు దూరం

గత మూడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. 2002 ఎన్నికల్లో 41.22 శాతం ఓటింగ్ జరగ్గా... 2009లో 42.95శాతం పోలింగ్ నమోదైంది. 2016లో 45.27 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ మూడు వరుస ఎన్నికల్లో కనీసం సగం... ఓట్లు కూడా నమోదు కాలేదంటే.. నగర ఓటర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఓటువేస్తున్న వారిలోనూ వయోధికులే అధికంగా ఉంటుండగా.. యువత ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. రాజధాని నగరంలో సహజంగా ఉద్యోగులు, విద్యావంతులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎక్కువ. ఇక్కడే ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇందులోనూ... విద్యావంతులు, ధనవంతులు ఉంటున్న ప్రాంతాల కంటె మధ్యతరగతి, పేదలు నివసిస్తున్న ప్రాంతాలు, బస్తీల్లోనే ఓటింగ్ ఎక్కువగా నమోదవుతోంది.

10 డివిజన్లలో 20శాతం లోపు పోలింగ్​

2016 ఎన్నికల్లో 10 డివిజన్ల పరిధిలో 20 శాతం లోపు ఓటింగ్‌ నమోదయింది. 18 డివిజన్లల్లో 30 శాతం ఓటింగ్‌ మించలేదు. ఇక 62 డివిజన్లల్లో ఓటింగ్‌ శాతం 40 దాటలేదు. పేదలు, రోజు కూలీలకు వెళ్లే వాళ్లూ పోలింగ్‌ రోజు కచ్చితంగా ఓటు హక్కును వినియోగిస్తుండగా, ఓటు హక్కు విలువ తెలిసిన వాళ్లు ఓటును వినియోగించుకోకపోవడం దురదృష్టం. ముఖ్యంగా గ్రేటర్‌లో దాదాపు 6 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగులు ఉంటుండగా... వీరిలో 10 శాతం మంది కూడా... ఓటు వేసేందుకు రావడం లేదు. ధనవంతులు ఓటింగ్‌కు వరుసలో నిలుచునేందుకు నిరాశక్తత చూపిస్తున్నారంటున్న విశ్లేషకులు... ఉద్యోగులు ఎన్నో సాకులు చూపుతున్నారని విమర్శిస్తున్నారు. తెలియని వాళ్లకు చెప్పాల్సిన వాళ్లే... ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అవగాహనకు ప్రణాళికలు

గత అనుభవాల నేపథ్యంలో... గ్రేటర్‌లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న ఈసీ... ప్రజల్లో విస్తృత అవగాహనా కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా 20 నుంచి 29 ఏళ్ల మధ్యనున్న 15 లక్షల పైచిలుకు యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సినీ ప్రముఖులతో ఓటుహక్కు ప్రాధాన్యాన్ని వివరించేలా ప్రచారం చేపట్టనుంది. ఇప్పటికే... అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఈసీ... నగరంలోని యువత, ఎన్జీవోలతో సమావేశాలు నిర్వహించనుంది. వీటితో పాటే... ఆస్తిపన్ను, మంచినీటి బిల్లుల చెల్లింపునకు సంబంధించి దాదాపు 12 లక్షల మంది ఫోన్ నంబర్లను జీహెచ్ఎంసీ, జలమండలి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం సేకరించింది. ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఆ మొబైల్ నంబర్లన్నింటికీ సందేశాలు పంపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

సాంకేతికతో ఓటర్​ స్లిప్పులు

గత ఎన్నికల్లో... చాలా మందికి ఓటరు స్లిప్పులు అందలేదని, ప్రజల ఓటు వివరాలు, పోలింగ్ కేంద్రాల సమాచారం సరిగా అందలేదని గుర్తించిన ఈసీ... ఈ లోపాలతో కొంత మేర ఓటింగ్‌ నష్టపోయినట్లు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో... ఈ సారి అందరికీ ఓటరు స్లిప్పులను వందశాతం చేరవేసేలా చర్యలు చేపట్టింది. జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేకంగా పర్యటించి ఓటరు స్లిప్పుల పంపిణీ విషయాన్ని నిర్ధరించుకోవాలని ఆదేశించింది. సాంకేతికతనూ వినియోగించుకుంటుంది. tsec.gov.in వెబ్ సైట్, Te-Poll మొబైల్ యాప్‌ల ద్వారా ఓటరు స్లిప్పులు పొందే అవకాశాన్ని కల్పించింది. రాజకీయ పార్టీలకు కూడా తమ పార్టీ గుర్తులు లేకుండా ఓటరు స్లిప్పులు పంపిణీ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.

ఓటింగ్ శాతాన్ని పెంచేలా పౌర సంఘాలూ కృషి చేస్తున్నాయి. కాలనీ, అపార్ట్​మెంట్ సంఘాలు, క్లబ్బులు, మార్కెట్లు తదితర ప్రదేశాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎలక్షన్ వాచ్ పేరిట యవతలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి :'తెలంగాణపై సవతి తల్లి ప్రేమ... ఇతర రాష్ట్రాలకు అమ్మ ప్రేమ'

ABOUT THE AUTHOR

...view details