రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మహానగరంలో పలు బస్తీల్లో కూడా ఈ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. రాజధానిలో 1,450 చోట్ల గుర్తించిన మురికివాడలుంటే ఇందులో చాలా వాటిలో డ్రైనేజీ, ఇతర కనీస సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో దశలవారీగా అక్కడి వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి ఆ స్థలంలో ఇళ్లను నిర్మించి ఇస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు. అనేకమంది బస్తీలను ఖాళీ చేయడానికి ససేమిరా అన్నారు. చివరికి 40 వాడల్లో నివాసముంటున్న వారు తమ ఇళ్లను ఖాళీ చేయడానికి అంగీకరించారు. ఈ నలభై చోట్ల పదివేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని మూడేళ్ల కిందటే మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 2వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. మరో వెయ్యి ఇళ్లను ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తరువాత పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఏడువేల ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి.
నిధుల విడుదలేదీ..?
నగరంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల వరకు నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ కారణంగా చాలా చోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు పట్టించుకుంటే సంబంధిత నియోజకవర్గంలో మాత్రం పనులు పూర్తవుతున్నాయి. సనత్‌నగర్ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాన్ని చాలా వరకు పూర్తి చేయించడంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కృతకృత్యులయ్యారు. మురికివాడలను ఖాళీ చేసిన వారిలో కొందరు అద్దెలు భరించలేక రోడ్లపక్కనే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. మరికొందరు తక్కువ అద్దెలున్న నివాసాల్లో ఉంటున్నారు. అద్దెలతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.