మూసీ నది హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన తర్వాతే మూ‘ఛీ’గా మారుతోంది. కాలుష్య కాసారంలా మారి కంపు కొడుతోంది. రోజురోజుకీ ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడి
మూసీ నది హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన తర్వాతే మూ‘ఛీ’గా మారుతోంది. కాలుష్య కాసారంలా మారి కంపు కొడుతోంది. రోజురోజుకీ ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడి
అదే నగరం దాటాకా మాత్రం నీటి నాణ్యత క్రమక్రమంగా మెరుగుపడుతుందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) అధ్యయనంలో వెల్లడైంది.
ఎలా లెక్క తేల్చుతారంటే..
నీటిలో ఉన్న ఆక్సిజన్ పరిమాణం(డీవో), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(డీవో) తీవ్రత ఆధారంగా ఓ చెరువు లేదా కుంట కాలుష్య కోరల్లో చిక్కుకుందా? లేదా? అని లెక్క తేల్చుతారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటర్ నీటిలో డీవో పరిమాణం కనీసం 4 ఎంజీలుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదా కుంటలో జలచరాలు బతకవు. బీవోడీ లీటర్ నీటిలో 3 ఎంజీలను మించకూడదు. అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రమాదకర జోన్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. డీవో తగ్గుతున్న కొద్దీ బీవోడీ పెరుగుతుంది.
మూసీ నగరంలో 50 కి.మీలు (మొత్తం 250 కి.మీలు) ప్రవహిస్తుంది. పీసీబీ అధికారులు పది చోట్ల జనవరిలో నమూనాలు సేకరించి పరీక్షించారు. నగరంలోకి ప్రవేశించాకే పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని తాజాగా విడుదల చేసిన నివేదికలో తేల్చారు. బాపుఘాట్, మూసారాంబాగ్ వంతెన, నాగోల్, నల్లచెరువు(ఉప్పల్), పీర్జాదిగూడ, ప్రతాపసింగారం దగ్గర డీవో పరిమాణం లీటర్ నీటిలో 0.3 ఎంజీల కంటే తక్కువగా ఉంది. నిర్దేశిత పరిమితుల కంటే బీవోడీ మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శివారుల్లోని పిల్లాయిపల్లి దగ్గర డీవో 0.3 ఎంజీల నుంచి 1.9 ఎంజీలకు పెరిగింది. రుద్రవెల్లి, వలిగొండ, సోలిపేటకు వెళ్లే సరికి నీటి నాణ్యతా మెరుగుపడింది. డీవో పెరుగుతుంటే బీవోడీ తగ్గింది.
ఎందుకిలా...
గ్రేటర్‌లో రోజూ 1600 ఎంఎల్‌డీ మురుగునీరు ఉత్పత్తి అవుతున్నట్లు పీసీబీ అధికారులు అంచనా వేశారు. ఇందులో 770 ఎంఎల్‌డీని మాత్రమే శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగిలినది నేరుగా కలిపేస్తున్నారు. పరిశ్రమల నుంచి ప్రమాదకర పారిశ్రామిక రసాయన వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా డంపింగ్ చేస్తున్నారు. నగరం దాటిన తర్వాత కృష్ణా నదిలోకి చేరే వరకు వివిధ పిల్ల కాల్వల ద్వారా శుద్ధమైన నీరు మూసీలోకి చేరుతుంది. దీంతోనే నీటి నాణ్యత క్రమక్రమంగా మెరుగుపడుతుందని పర్యావరణవేత్తలు వివరిస్తున్నారు.
ఇదీ చదవండి:'ఎన్నికల్లో అక్రమాలు జరిగాయ్... సీబీఐతో దర్యాప్తు చేయించండి'