తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: పట్టణాల్లో పోటెత్తిన చైతన్యం - పురపోరు

పురపాలక ఎన్నికలు జాతరను తలపించాయి. తొలిసారి ఓటు వచ్చిన ఓటర్లలో యువచైతన్యం పోటెత్తింది. యువతకు పోటీగా వృద్ధులు ఓటు వేసేందుకు బారులు తీరారు. మేము సైతమంటూ మహిళలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈటీవీ భారత్ నిర్వహించిన ఓటు అవగాహన సదస్సులు సత్ఫలితాలిచ్చాయి.

POLLING PERCENTAGE HIKE IN MUNICIPAL ELECTIONS
POLLING PERCENTAGE HIKE IN MUNICIPAL ELECTIONS

By

Published : Jan 22, 2020, 10:32 PM IST

Updated : Jan 23, 2020, 5:33 AM IST

పురపాలక ఎన్నికల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. కొత్త పురపాలక సంఘాల్లో అత్యధికచోట్ల ఓటర్లు పోటెత్తారు. నగర పాలక సంస్థల్లో మాత్రం ఉదాసీనత కొనసాగింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా 120 పురపాలక సంఘాలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలుగా ఉండి పురపాలక సంఘాలుగా మారిన వాటిలో ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.పోలింగ్‌ కేంద్రాలవద్ద ప్రచారం చేస్తున్నారని పలుచోట్ల అభ్యర్థులు ఘర్షణ పడ్డారు. పోలింగ్‌ రోజున కూడా ప్రలోభాలు కొనసాగాయి.

పురపాలక సంఘాల్లో 74.73 శాతం, నగరపాలక సంస్థల్లో 58.86 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధిక పోలింగ్‌ శాతం యాదాద్రిభువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో నమోదైంది. ఇక్కడ అత్యధికంగా 93.31 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్పొరేషన్లలో రామగుండంలో 67.66 శాతం పోలింగ్‌తో టాప్‌లో నిలిచింది. ఓటింగ్‌లో మొదటి 14 స్థానాల్లో కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలే ఉండటం గమనార్హం. పాత పురపాలక సంఘాల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదులో హుజూర్‌నగర్‌ మొదటి స్థానంలో నిలిచింది.

టెండర్‌ ఓటు... రీ పోలింగ్‌!

కామారెడ్డి బల్దియాలోని 41వ వార్డు పరిధిలోని 101 పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదైంది. ఒక మహిళ వేరే మహిళ ఓటును వేశారు. నాలుగు గంటల ప్రాంతంలో అసలు ఓటరు రాగా అప్పటికే ఓటు వేసిన ఉన్న విషయాన్ని అధికారులు చెప్పారు. తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆమె కోరగా అధికారులు విచారణ నిర్వహించి టెండర్‌ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 24న రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఎన్నికల సంఘానికి తెలియజేశారు.

ఎంపీ అర్వింద్‌పై కేసు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 21వ తేదీన తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పోస్టు ఉంచారని ఎన్నికల నిఘా బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అక్కడ తక్కువ పోలింగ్‌..

హైదరాబాద్‌ చుట్టూ ఉన్న 21 పురపాలికలు, 7 నగరపాలక సంస్థల్లో గ్రామీణ వాతావరణం ఉన్న మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది ఓటింగ్‌కు ఆసక్తి చూపగా.. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు అధికంగా ఉన్న మణికొండ, నిజాంపేట తదితర మున్సిపాలిటీల్లో పోలింగ్‌ బాగా తక్కువగా నమోదైంది.

ప్రలోభాలు యథావిధిగానే

పలుచోట్ల ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తంటాలు పడ్డారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో పోలింగ్‌కు ముందు నుంచే నగదు, కానుకలు పంపకాలు జరిపిన పలువురు అభ్యర్థులు బుధవారం ఒక పక్క పోలింగ్‌ జరుగుతుండగానే మరోవైపు వార్డుల్లో ఓటర్లకు నగదు, నజరానాలను అందజేశారు.

మద్యం, డబ్బుతో పట్టుబడిన అభ్యర్థినిపై కేసు

నిజామాబాద్‌ నగర పాలకసంస్థ 41వ డివిజన్‌ తెరాస అభ్యర్థిని చాంగుబాయి మద్యం, డబ్బుతో ఎన్నికల నిఘా బృందానికి పట్టుపడ్డారు. పోలింగ్‌ కేంద్రానికి సమీపంలోని ఓ ఇంట్లో నగదు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు ఎన్నికల నిఘా బృందానికి ఫిర్యాదు అందింది. వారు తనిఖీ చేసే సందర్భంలో తెరాస అభ్యర్థిని సంఘటన స్థలంలో ఉన్నారు. రూ.8,500 నగదు, 18 మద్యం సీసాలు సీజ్‌ చేశారు. కేసు నమోదు చేశారు.

ప్రలోభాల్లో టాప్‌.. ఓటింగ్‌లోనూ టాపే

ఓటర్లను ప్రలోభపెట్టడంలో అభ్యర్థులు పోటీపడిన చౌటుప్పల్‌లో ఓటు వేయడానికి ప్రజలు పోటీపడ్డారు. ఇక్కడ కొందరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు 30 వేల రూపాయలకు పైగా ఇచ్చినట్లు సమాచారం. ఇక్కడే రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది

25న ఓట్ల లెక్కింపు

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 120 పురపాలక సంఘాలు, తొమ్మిది నగరపాలక సంస్థల ఓట్ల లెక్కింపు శనివారం జరగనుంది. పోలింగ్‌ తర్వాత అభ్యర్థులు పోలింగ్‌ సరళిని విశ్లేషించుకున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియగా శుక్రవారం పోలింగ్‌ జరగనుంది.

బస్తీమే సవాల్: తెలంగాణ ఓటర్లలో పోటెత్తిన చైతన్యం

ఇవీ చూడండి: కళ్లులేకపోయినా... ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధుడు

Last Updated : Jan 23, 2020, 5:33 AM IST

ABOUT THE AUTHOR

...view details