రాష్ట్రంలో 27 జిల్లాల్లో మూడోవిడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా అక్కడక్కడ గొడవలు జరిగాయి. సూర్యాపేట, నల్గొండ, వికారాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు.
కర్రలతో దాడి చేసుకున్న గులాబీ, హస్తం నేతలు...
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌లో తెరాస-కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది. తమ పార్టీకే ఓటు వేయాలని ఇరువర్గాలు ప్రచారం చేస్తుండగా వివాదం మొదలైంది.
ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు.
పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ...
సూర్యాపేట జిల్లాలోనే మఠంపల్లి మండలం రఘనాథపాలెంలోనూ ఇదే పరిస్థితి. ఓటర్లు ఓటు వేస్తుండగా గులాబీ-హస్తం పార్టీల సభ్యులు ప్రచారానికి దిగారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వివాదం తలెత్తింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఎన్నికలు బహిష్కరించినా పట్టించుకోని అధికారులు...
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంజీగూడ, నేరేడుగొండ(కె) గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ రెండు గ్రామాలను కలిపి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎవరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ, పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా అధికారులు తమ వినతిని పట్టించుకోవడంలేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.