Opposition Parties fight against BRS in Telangana :కన్నడ నాట కాంగ్రెస్ విజయదుందుభి మోగించడంతో ఆ పార్టీలో కొత్త ఊపు వచ్చింది. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే ధీమా హస్తం పార్టీతో పాటు.. విపక్ష పార్టీల్లోనూ నెలకొంది. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ, తెలంగాణ జనసమితితో పాటు ప్రజా సంఘాలన్నీ ఒక వేదికగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. పొత్తులకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఇప్పటికే వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీజేఎస్ అధినేత ఆచార్య కోదండరాం సంకేతాలిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వేదిక రాబోతున్నట్టు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలూ అప్రమత్తమయ్యాయి. వివిధ పార్టీల్లోని నేతల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చొరవ మొదలైంది. బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లను చీలిపోకుండా నివారించే విపక్షపార్టీలు ఒక్కటవుతున్నాయి. వ్యవహారం మొత్తం మూడో కంటికి తెలియకుండా గోప్యంగా జరుగుతోంది. ప్రత్యామ్నాయ వేదికకు వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పౌర వేదికలు కూడా తగిన సహకారాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల చివరి కల్లా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రానున్నట్టు సమాచారం. అందరిని ఒక చోటికి చేర్చే బాధ్యతను ఆచార్య కోదండరాంకు అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ధూంధాం పేరుతో తమ పాత్రను పోషించిన కవులు, కళాకారులకు.. కేసీఆర్, బీఆర్‌ఎస్‌తో దూరం ఏర్పడిందని చర్చ నడుస్తోంది. ప్రజా, కుల సంఘాలు, పౌరవేదికలు తెలంగాణ సాధన కోసం తమ గొంతెత్తి కొట్లాడాయి.
స్వరాష్ట్రం సిద్ధించాక అనుకున్న కలలు తీరకపోగా.. నిర్భందాలు ఎక్కవయ్యాయనే భావనతో మౌనం దాల్చాయనే భావన ఉంది. విపక్ష పార్టీలతో పాటు ప్రజా, కుల సంఘాలు, పౌర వేదికలు తెలంగాణ ఉద్యమం తరహాలో.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఒక్కటవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. విపక్షలన్నీ, ఇన్ని సంఘాలతో వేదిక ఏర్పాటనేది మాములు విషయం కాదు. దీనిని సమన్వయం చేయడం అంత అషామాషీకాదు.
Opposition Parties Have a Single Platform attack BRS :తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరాం అయితే.. బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే భావనను అన్ని పార్టీలు వ్యక్తపరుస్తున్నట్లు సమాచారం. కవులు, కళాకారులు, ప్రజా సంఘాలతో ఆయనకు ఉద్యమ సమయం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ వేదికకు కోదండరాం సారథ్యం వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.