Sanitation Tenders: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య, భద్రతా నిర్వహణ టెండర్లపై రాజకీయ క్రీనీడ కమ్ముకుంటోంది. వీటి నిర్వహణకు గతంలో కంటే ఎక్కువ నిధులను సర్కారు కేటాయించడంతో పాటు గతంలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఎక్కడికక్కడే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. దీంతో స్థానిక ఉన్నతాధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తమకు నచ్చిన వారికి టెండర్లు దక్కేలా ఎత్తుగడలు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని పలువురు కోరుతున్నారు.
కార్మికుల వేతనాలు పెంచేలా:ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య ప్రమాణాల మెరుగు, కార్మికుల వేతనాల పెంపునకు ఒక్కో పడకకు రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచుతూ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.338 కోట్లు కేటాయించింది. గతంలో ఒక్కో పడకకు రూ.5వేలు ఉండగా..కొందరు చాలా తక్కువ ధరకు (ఒక్కో పడకకు రూ.3,500) నిర్వహిస్తామని టెండర్లు దక్కించుకున్నారు. దీంతో నిధులు సరిపోక నిర్వహణ కష్టమైంది. ఆ ప్రభావం పారిశుద్ధ్య సిబ్బందిపై పడింది. నిబంధనల మేరకు 100 మంది పనిచేయాల్సిన చోట 60-70 మందితోనే సరిపెట్టారు. పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది వేతనాలు కూడా రూ.6-9వేలు మాత్రమే ఇస్తున్నారు. దీనికంతటికీ కారణం టెండరులో పేర్కొన్న దాని కంటే తక్కువ ధరకు నిర్వహిస్తామని ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు.. ఒక్కో పడకకు కేటాయించిన మొత్తం కూడా తక్కువగా ఉందని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. స్పందించిన సర్కారు ఒక్కో పడకకు ఇచ్చే ధరను రూ.7,500కు పెంచింది. ఈ ధర కంటే ఒక్క రూపాయి తక్కువకు చేస్తామని చెప్పినా కుదరదని ప్రభుత్వం తేల్చింది. టెండరు దక్కించుకున్న గుత్తేదారులకు నిర్వహణ వ్యయం కింద గరిష్ఠంగా 5 శాతం వరకూ ఇస్తారు. ఈ అయిదుశాతంలో ఎంత తక్కువ మొత్తానికి చేయడానికి ముందుకొస్తారో.. వారికే టెండరు దక్కేలా కొత్త నిబంధనలు రూపొందించారు. అలా అని ఒక్క రూపాయి కూడా నిర్వహణ వ్యయం వద్దని ‘0’కు టెండరు వేసినా చెల్లుబాటు కాదు. ఇదే సమయంలో కార్మికుల వేతనాన్ని కూడా కనీసం రూ.15,600 ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇందులోనే ఈఎస్‌ఐ, పీఎఫ్, దుస్తుల ఖర్చులు కూడా ఉంటాయి. ప్రతి 100 పడకలకు కచ్చితంగా 45 మంది పారిశుద్ధ్య, భద్రత సిబ్బంది అవసరమని లెక్కతేల్చారు. ఒకవేళ మంజూరైన పడకల సంఖ్య కంటే ఎక్కువ పడకల్లో చికిత్స అందించాల్సి వస్తే.. ఆ పెరిగిన సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకొని చెల్లించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.