తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రీతి మృతి పట్ల కేసీఆర్ సంతాపం... రూ.30 లక్షల పరిహారం - నిమ్స్​లో చికిత్స పొందుతూ ప్రీతి మృతి

Politicians Condolences to Preethi Death: ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రులు, రేవంత్​రెడ్డి, డీకే అరుణ ప్రీతి మృతికి సంతాపం తెలిపారు. ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటుందన్నారు.

Politicians Condolences to Preethi Death
Politicians Condolences to Preethi Death

By

Published : Feb 26, 2023, 10:57 PM IST

Updated : Feb 27, 2023, 8:04 AM IST

Politicians Condolences to Preethi Death: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి.. మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. 5 రోజులుగా నిమ్స్‌ వైద్యుల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 9 గంటల 10 నిమిషాలకు ప్రీతి చనిపోయిందని... నిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఈ నెల 22న కేఎంసీలో సీనియర్‌ వేధిస్తున్నాడని.. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. వైద్య విద్యార్థినీ ప్రీతి మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. విచారణలో తేలిన దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

వైద్య విద్యార్థిని మృతిపై రాష్ట్ర మంత్రులు హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంతాపం తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్‌ వైద్యులు శక్తివంచన లేకుండా కృషి చేశారన్న మంత్రి హారీశ్‌రావు... విద్యార్థినీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రీతి మృతి అత్యంత బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

సీఎం ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి రూ.20 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమని నిందితుడిని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టబోమని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్‌, గంగుల కమలాకర్‌ వెల్లడించారు. మృత్యువుతో పోరాడుతూ వైద్య విద్యార్థిని ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు. గిరిజన వైద్య విద్యార్థి ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న ప్రీతి ఆత్మహత్య అత్యంత బాధాకరమన్న ఆయన... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రీతి మరణానికి అన్ని కోణాలలో విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రీతి మరణంతో నిమ్స్‌ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు... అధికారులు సిద్ధం చేస్తున్నారు. గిరిజన, విద్యార్థి సంఘాలు, భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రీతి కోలుకోవాలని మామూలు మనిషవ్వాలని... ఎంతో మంది ప్రార్ధించారు. ఏదైనా అద్భుతం జరుగుతుందని భావించారు. కానీ. ప్రీతి... అర్ధాంతరంగా కన్నుమూసి అందరికీ తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. వైద్యురాలిగా... సంఘంలో గౌరవ స్ధానంలో ఉండాల్సిన యువతి.. అనుకోని పరిస్ధితుల్లో విగతజీవిగా మారింది. డాక్టర అవ్వాలన్న ఆమె కోరిక నెరవేరకుండానే... జీవనగమనం నుంచి నిష్క్రమించింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 27, 2023, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details