తెలంగాణ

telangana

ETV Bharat / state

Power war between BRS and Congress : కరెంట్‌ కయ్యం.. రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందు నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్

Political war on free electricity : అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళనలు, కాంగ్రెస్‌పై చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. ఉచిత కరెంటును తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని.. ప్రజల్లో తమ పార్టీకి పెరిగిన ఆదరణను బీఆర్‌ఎస్‌ భరించలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను మరిచిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తోందన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 12, 2023, 9:52 AM IST

కరెంట్‌ కయ్యం.. హస్తం శ్రేణుల సబ్‌స్టేషన్ల ముట్టడి

Power Politics in Telangana : రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా చేపట్టే "సత్యాగ్రహ దీక్షలను నీరుగార్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉచిత విద్యుత్‌పైకి దృష్టి మరల్చేందుకు బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీ బీ-టీం అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోందని.. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లినా తెలుస్తుందన్నారు.

విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టింది కేసీఆరే అని.. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్ల ముందు నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు రేవంత్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కాంగ్రెస్‌ నాయకురాలు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తు పంపిణీకి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తెలిపారు .

Bhatti Vikramarka on Revanth Comments : ఉచిత విద్యుత్‌ పథకంపై పేటెంట్‌ హక్కు పూర్తిగా కాంగ్రెస్‌దేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇవ్వటం పెద్ద లెక్క కాదన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. గ్రామాల్లో పది గంటల ఉచిత విద్యుత్ కూడా రావట్లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఏ సందర్భంలో మాట్లాడారో తెలుసుకోవాలన్నారు.

24గంటల కరెంటు ఎక్కడా రావటంలేదు : పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వక్రీకరించిందని... ప్రభుత్వం చెబుతున్న 24గంటల కరెంటు ఎక్కడా రావటంలేదని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ అన్వేశ్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ తెచ్చిన ఉచిత విద్యుత్‌ను చంద్రబాబుతో కలిసి వ్యతిరేకించిన ఘనత కేసీఆర్‌దని ఆ పార్టీ నేత కోదండరెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదన్న షబ్బీర్‌ అలీ.. తాము తెచ్చిన ఉచిత కరెంటును తామే ఎందుకు ఎత్తేస్తామని ప్రశ్నించారు. విద్యుత్‌ కొనుగోలులో జరిగిన అవినీతిని బయటపెడితే.. తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్‌ మాట్లాడుతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

రేవంత్‌రెడ్డి మాటలను వక్రీకరిస్తున్నారు :రేవంత్ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ వక్రీకరించారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ అన్నారు. ఉచిత విద్యుత్‌ పేరుతో 60 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాటలను వక్రీకరిస్తున్నారని.. వరంగల్‌ డిక్లరేషన్‌కు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామన్న ఆయన.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధంతో రాజకీయ వేడి రగులుకుంది. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు నిరసనగా ఇప్పటికే అధికార పార్టీ శ్రేణులు రోడ్డెక్కగా... రేవంత్‌రెడ్డి పిలుపుతో హస్తం శ్రేణులు సబ్‌స్టేషన్ల ముట్టడికి సిద్ధమయ్యాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details