Political Parties Focus on Hyderabad Election Plans : రాజధాని పరిధిలో అధిక స్థానాలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో మాత్రం ఎటువంటి సభలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గాల్లో కూడా పెద్దగా ప్రచార హడావుడి కనిపించడం లేదు. దీనికి కారణం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.
ఈ నెల రెండో వారం నుంచి రాజధానిలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభలపై దృష్టిసారించనున్నాయి. రాజకీయ పార్టీలు రెండువారాల పాటు వరుసగా బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ఈ సభలకు అనుగుణంగా జనాల సేకరణపై దృష్టిపెట్టాలని అభ్యర్థులకు అగ్రనేతలు సూచించినట్లు సమాచారం.
BRS Target On Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌పై.. బీఆర్ఎస్ ఫోకస్
BRS Election Campaign 2023 :బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. రాజధానిలో ఈసారి ఎలాగైనా 20 సీట్లకు పైగా గెలవాలని ఆపార్టీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ప్రచారం పరంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ అభ్యర్థులు, సీనియర్ నేతలతో మాట్లాడారు. ఈ నెల రెండోవారం తరువాత హైదరాబాద్ నలువైపులా నాలుగైదు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటన్నింటిలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. నవంబర్ చివరి వారం రోజులు అన్ని నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సభలు, మూడోవారంలో ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.