అసంతృప్తులతో బేరసారాలు
రహస్య సమావేశాలు...బుజ్జగింపులు...నామినేటెడ్ పదవుల ఆశ. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తున్న పరిస్థితి ఇది. పురపాలికల్లోని పలు వార్డులు, డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉండటంతో రెబెల్స్‌ను తప్పించేందుకు నేతలు బుజ్జగింపుల జోరును పెంచారు. రంగంలోకి దిగిన పార్టీల ముఖ్యనేతలు... నామినేషన్లు వేసిన వారిని సముదాయిస్తున్నారు. అభ్యర్థులతో నేరుగా సంప్రదింపులు చేస్తూ రాజీ కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అధికార పార్టీలో కో-ఆప్షన్, మార్కెట్ డైరెక్టర్లు, ఇతర నామినేటేడ్ పదవులతోపాటు పార్టీ పదవుల ఎర వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఎక్కువ మంది పోటీ లేకుండా చూడడానికి మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి బేరసారాలు సాగిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల మొండిపట్టు..నేతలకు తలనొప్పులు
అధికార తెరాస పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ అదే తరహాలో ఆశావహులు పోటీకి దిగారు. చాలాచోట్ల తెరాస, కాంగ్రెస్ పార్టీలో ఒక్కో వార్డుల్లో సగటున ముగ్గురు, నలుగురు నామినేషన్‌లు వేశారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసిన వారిలో చాలామంది తమకంటే తమకే టికెట్ కావాలంటూ మొండి పట్టు పడుతుండటంతో పార్టీ ముఖ్యులకు తలనొప్పులు తప్పటం లేదు. ఎవరికి వారుగా అభ్యర్థులు ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అనేలా పార్టీని అభ్యర్థిస్తుండటంతో ఎవరికి టికెట్‌ని ఇవ్వాలనేది పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. అందుకే బలమైన అభ్యర్థిని బరిలో నిలుపుతూనే ఇతరుల్ని పోటీ నుంచి తప్పించేందుకు పార్టీ ముఖ్యులు నానాతంటాలు పడుతున్నారు. పోటీలో ఉన్న మిగతా వారిని నయానో భయానో ఇచ్చి ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు చెబితే వారు వింటారోననే విషయమై ఆరా తీస్తూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇది ఫలిస్తున్నా మరికొన్నిచోట్ల వినేపరిస్థితి లేకపోవడంతో ఉపసంహరణ గడువు వరకు పంచాయితీ నడవనుంది.