తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ.. కలెక్టరేట్‌లను ముట్టడించిన బీజేపీ.. ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్

BJP Leaders Besieged Collectorates in Telangana: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై విపక్షాలు, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త నిరసనలతో హోరెత్తించాయి. గవర్నర్‌ను కలిసిన బీజేపీ, బీఎస్పీ నేతలు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. కమలం నాయకులు కలెక్టరేట్ల ముట్టడి చేపట్టి... కమిషన్‌ వైఫల్యానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని నినదించారు. లీకేజీ వ్యహారంలో పెద్దల పాత్ర ఉందని ఆరోపించిన కాంగ్రెస్‌ వారందరికీ కఠిన శిక్షలు పడే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేసింది.

BJP Leaders Besieged Collectorates
BJP Leaders Besieged Collectorates

By

Published : Mar 18, 2023, 7:25 PM IST

TSPSC పేపర్ లీకేజీ.. కలెక్టరేట్‌లను ముట్టడించిన బీజేపీ.. ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్

BJP Leaders Besieged Collectorates in Telangana : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. డీకే అరుణ, ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి సహా పలువురు నేతలతో కూడిన బృందం గవర్నర్‌ను కలిశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో అనుమానాలు ఉన్నాయని... టీఎస్‌పీఎస్సీలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయాలు, అధికారంపై ఉన్న ఆసక్తి... నిరుద్యోగుల జీవితాలపై లేదని దుయ్యబట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కలెక్టరేట్ల ముట్టడి :టీఎస్‌పీఎస్సీ వైఫల్యానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించడంతో పాటు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పదవులకు రాజీనామా చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కలెక్టరేట్ల ముట్టడి చేపట్టింది. సీఎం కేసీఆర్, ఐటీశాఖమంత్రి కేటీఆర్ పదవులకు రాజీనామా చేయాలంటూ నినదించారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఖమ్మంలో కలెక్టరేట్‌లోకి చోచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లీకేజీ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆదిలాబాద్‌లో బీజేపీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి.

న్యాయ విచారణకు ఎందుకు వెనకంజ వేస్తున్నారు : జగిత్యాలలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు సీఎం కేసీఆర్‌... వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్గొండలో.. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. లీకేజీకి నైతిక బాధ్యుడిని చేసి మంత్రి కేటీఆర్‌ను కేబినెట్‌ నుంచి తొలగించాలని... ములుగులో బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్‌ను కమలం నేతలు ముట్టడించారు. దుబ్బ నుంచి బీజేపీ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. న్యాయ విచారణకు ఎందుకు వెనకంజ వేస్తున్నారని ప్రశ్నించారు.

రేపు ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని... పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కేసీఆర్, కేటీఆర్ వల్ల రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు అపహాస్యంగా మారాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన ఆయన సిట్‌ విచారణతో అసలు విషయాలు బయటకు రావని ఆరోపించారు. లీకేజి దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆక్షేపించారు.

కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండించిన కోదండరాం :రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరే పెద్ద సమస్యగా మారారని.. తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లికేజీ వ్యక్తుల వల్ల జరిగిందని... వ్యవస్థకు అపాదించొద్దన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి కోదండరాం నివాళి అర్పించారు. ఓయూ లైబ్రరీ నుంచి న్యాయ కళాశాల వరకు వామపక్ష విద్యారిసంఘాలు ర్యాలీ నిర్వహించాయి. టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని నినదించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details