ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనుల సమ్మె నిర్వహించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు నాయకులు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అప్పటి జేఏసీ ఛైర్మన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఫనంగా పెట్టి..సకల జనుల సమ్మెలో పాల్గొనడం, ఇతర అన్ని వర్గాలు కూడా కలిసి రావడంతోనే తాము 42 రోజులపాటు సకల జనుల సమ్మెను చేయగలిగామని నాటి జేఎసీ ఛైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు.
ఉద్యోగ, కార్మిక సంఘాలతో నెల రోజులపాటు సుదీర్ఘంగా చర్చించిన తరువాతనే ఈ సమ్మెకు ప్రణాళిక రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. 11వందల మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు తీసుకున్నారని...ఇంత పెద్ద పోరాటం గుర్తుండేందుకు ఇవాళ సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం కాని...తమ వినతులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకుడిగా స్వామిగౌడ్‌పై దాడి జరిగినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లామని...రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు కలిసి రావడంతోనే సమ్మె విజయవంతమైందని...ప్రత్యేక రాష్ట్రాన్ని అందించి స్వయం పాలనను నెరవేర్చిన ఇవాళ్టికి... ప్రత్యేకత ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం శెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అన్ని వర్గాలు అంత శాంతియుతంగా చేరి... కొట్లాడిన సందర్భం మరొకటి లేదు. తెలంగాణ సమ్మె అంటే కేవలం కేసీఆర్ దీక్షను చూపించడం మాకు సమ్మతం కాదు. కొట్లాడినాం కదా..! కీర్తి కిరీటాలు అడగలేదు, కుర్చీలు అడగలేదు. మా శ్రమను గుర్తు చేసుకోండి... మాపాత్రను గుర్తు చేసుకోండని మాత్రమే అడుగుతున్నాం. ఆ అడిగే హక్కు మాకు ఉంది. మేం కోరుకున్న తెలంగాణ వస్తాదని మా ఆశ. ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి. మేం ఏదైతే తెలంగాణ కావాలని కోరుకున్నామో.. దానికోసం నిలబడతాం, కొట్లాడతాం. అది మాత్రం మేము ప్రకటించదలచుకున్నాం.మళ్లాకూడా కొట్లాడాల్సిన పరిస్థితి రావడమే మేము బాధపడుతున్నాం.- ప్రొ.కోదండరాం, తెజస అధ్యక్షుడు.