అలనాటి నటి జమున మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వెండితెర సత్యభామగా పేరు గాంచిన ఆమె పోషించిన పాత్రలు ఆత్మవిశ్వాసానికి, మహిళా సాధికారతకు ప్రతీకలుగా ఉండేవని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానని వెంకయ్య తెలిపారు.
ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర..: జమున మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కిషన్రెడ్డి సంతాపం..: జమున మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వివిధ పాత్రల్లో నటించి, అభిమానులను చూరగొన్న గొప్ప నటి జమున అని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.
తనదైన ముద్ర వేశారు..: ప్రేక్షకుల గుండెల్లో జమున తనదైన ముద్ర వేసుకున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. 1980లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికైన ఆమె.. ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. జమున మృతి పట్ల సంతాపం ప్రకటించిన గుత్తా.. ఆమె కుటుంబసభ్యులకు తన సానుభూతిని తెలిపారు.