Political Leaders Gifts Distribution in Telangana : పోలింగ్‌కు మరో మూడు రోజులే సమయం ఉండటంతో ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి. కొన్ని నియోజకవర్గాల్లో 30 నుంచి 40 కోట్లు పంచడం పూర్తయినట్లు సమాచారం. ఇకపోతే సభలు, ప్రచారానికి జనం తరలింపు, వాహనాల ఖర్చులు, పోలింగ్‌కు ముందు ఓటర్లకు ప్రత్యేకంగా పంచేవి వీటికి అదనం. బరిలో దిగిన అభ్యర్థులు ఏ గ్రామంలో అడుగు పెడితే అక్కడ తమ మార్కును చూపిస్తున్నారు. సభలు ప్రారంభం కావడానికి ముందే చికెన్, మటన్ బిర్యానీలతో భోజనాలను వడ్డిస్తున్నారు. కడుపునిండా తినాలని నాయకులే దగ్గరుండి వడ్డిస్తున్నారు. సభలు ప్రారంభంకాగానే అభ్యర్థులు తమ పార్టీ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. తను గెలిచాక గ్రామాలలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు.
Telangana Assembly Election 2023 : పరిగి, కొడంగల్, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఎస్పీలు హోరా హోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. అగ్రనాయకులతో రోడ్ షోలు సభలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ పోటీ ఎక్కువగా ఉంది. ఎవరికివారు గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గ కేంద్రాల్లో సామాజిక వర్గాల వారిగా వేడుక మందిరాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తున్నారు. గ్రామాల నుంచి పార్టీ నాయకులు వాహనాల్లో వేల మందిని తరలిస్తున్నారు.
యువతకు ఉద్యోగాల విషయంలో హామీలిస్తూ.. వారికి కావలసిన ఆట వస్తువులను ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మహిళలకు పట్టు చీర.. కుక్కర్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, స్టౌలు అందజేస్తున్నారు. మరోవైపు ఆలయాలకు ఫండ్‌గా రూ.2 లక్షలకు పైగా.. కుల దేవతలు ఆలయాల పునర్నిర్మాణానికి రూ.5 లక్షలు సమర్పిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల దాకా ప్రచారం చేసినందుకు ప్రధాన పార్టీల నేతలు రోజుకు ఒక్కో గ్రామానికి రూ.10వేలను ప్రచార ఖర్చుల కింద చెల్లిస్తున్నారు.
ఆ గట్టునున్నావా ఓటరన్నా ఈ గట్టునున్నావా - ప్రజానాడి తెలియక అభ్యర్థుల పరేషాన్