అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని స్టార్ షట్లర్ పీవీ సింధు (Pv Sindhu) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు.. హైదరాబాద్ చేరుకుంది. దిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సింధుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘన స్వాగతం పలికారు. అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని వెల్కం చెప్పారు.
నన్ను విష్ చేయడానికి వచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్... ఇంకా ఇతర అధికారులకు, అభిమానులకు అందరికీ థాంక్స్. మీ సపోర్ట్ వల్ల సాధించగలిగాను. నేను ఎప్పుడు ఏం అడిగినా నాకు సపోర్ట్ చేశారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్‌కు అనుమతి ఇచ్చినందుకు మినిస్టర్‌కు థాంక్స్. రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. మున్ముందు కూడా మంచిగా ఆడి దేశానికి మరిన్ని పతకాలు సాధిస్తా.
-- పీవీ సింధు, స్టార్ షట్లర్
దేశ ప్రజలందరూ పీవీ సింధు స్వర్ణం సాధించాలని కోరుకున్నారని... ముఖ్యమంత్రి కేసీఆర్... క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో క్రీడా పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు సింధు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
దేశ ప్రజలకు గర్వించే రీతిలో పీవీ సింధు రెండు సార్లు మెడల్స్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఒలింపిక్స్‌లో వంద శాతం స్వర్ణం సాధించాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. త్వరలోనే క్రీడాపాలసీని తీసుకురాబోతున్నాం. భవిష్యత్‌లో తెలంగాణ క్రీడా హబ్‌గా మారుతుంది. పీవీ సింధు మరిన్ని పతకాలు సాధించాలని కోరుతున్నా. ఆమెకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.