Thatikonda Rajaiah vs Kadiyam Srihari :ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఏడు చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. అందరిలాగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభ్యర్థుల ప్రకటనను అక్కడి ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఎందుకంటే గులాబీ నేతల మధ్య వర్గపోరే ఇందుకు కారణం. ఓరుగల్లులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య విభేదాలు నువ్వా నేనా అనేతంగా మారాయి.
ఇందులో ముఖ్యంగా జనగాం, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లోని నేతల మధ్య.. పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా పరిస్థితులు దారి తీశాయి. ఇది కాస్తా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కానీ ఇప్పుడు స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను.. ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యను (MLA Rajaiah) కాదని .. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరిని (MLC Kadiyam Srihari) ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే ఇప్పుడు ఓరుగల్లు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే ఇరువురు నేతలా మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. మరీ కేసీఆర్ రాజయ్యను పక్కనబెట్టికడియం శ్రీహరికిఇవ్వడం వెనుక చాలా కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో కొన్నింటిని ఉదాహరణగా చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాజయ్య బీఆర్ఎస్‌లో చేరి విజయం సాధించారు. దీంతో కేసీఆర్ ఆయనకు ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి పదవిని ఇచ్చారు. కానీ కొన్నిరోజులకే రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్కడితో అంతా సద్దుమణిగింది.
కానీ ఇటీవలే రాజయ్యపై లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలు చేశారు. ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి చేరింది. దీంతో రాజయ్యను పిలిచి మందలించారు. ఈ నేపథ్యంలోనే రాజయ్య.. సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. దీంతో ఈ కథకు ఫుల్‌స్టాప్ పడింది. మరోవైపు ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు.. విచారణ చేపట్టి నివేదిక అందించాలని పోలీస్ శాఖను కూడా ఆదేశించాయి.