కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో పోలీసులు మరింత క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వ్యాధిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గుర్తిస్తున్న హాట్‌స్పాట్లపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. వ్యాధి ప్రబలకుండా ప్రజల రాకపోకలను కట్టుదిట్టంగా నియంత్రించే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. తబ్లిగీ జమాత్‌కు వెళ్ళి వచ్చిన వారిలో అనేక మంది దీని బారిన పడటం, వారంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడం వల్ల ఇప్పుడిది పెను సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో దీనికి అడ్డుకట్ట వేయాలంటే వ్యాధి సోకినవారున్న ప్రాంతాలను మిగతా ప్రాంతాల నుంచి భౌతికంగా వేరుచేయక తప్పని పరిస్థితి. అంటే రాకపోకలు నిలిపివేయడమే. ఈ బాధ్యత పోలీసులపై పడనుంది. కరోనా ఉద్ధృతి మొదలైనప్పటి నుంచీ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్న పోలీసులు ఇప్పుడీ అదనపు బాధ్యతలు సైతం చేపట్టనున్నారు.
కరీంనగర్ మాదిరి
ఇండోనేసియా నుంచి వచ్చిన వారి ద్వారా కరీంనగర్‌లో ఒకేసారి పది కేసులు బయటపడ్డ సంగతి తెలిసిందే. స్థానికులిచ్చిన సమాచారంతో విదేశీయులను నిర్బంధంలోకి తీసుకొని పరీక్షలు నిర్వహించగా తొలుత 8 మందికి, ఆపై మరో ఇద్దరికీ కరోనా సోకినట్లు వెల్లడయింది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్‌లో సత్వర చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పోలీసుశాఖ క్రియాశీలక పాత్ర పోషించింది. కరోనా వ్యాధిగ్రస్తులు తిరిగిన, బస చేసిన ప్రాంతాలలో ప్రజల రాకపోకలను నియంత్రించడంలో సఫలమైంది. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి బయట తిరుగుతున్న వారిని నియంత్రించగలిగింది. వైద్య సిబ్బందితో పాటు కరోనా నియంత్రణలో పాలుపంచుకుంటున్న ఇతర ప్రభుత్వ సిబ్బందికి సహాయ సహకారాలు అందజేసింది.. ఇప్పుడు ఇదే నమూనాను అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే గుర్తించిన హాట్‌స్పాట్లను నిర్బంధించాలని భావిస్తున్నారు. సంబంధిత కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఇవీచూడండి:'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'