తెలంగాణ

telangana

ETV Bharat / state

Social Media Posts: సామాజిక మాధ్యమాలపై పోలీసు కన్ను.. విద్వేషాలు రెచ్చగొడితే ఇక అంతే! - సామాజిక మాధ్యమాల కథనాలపై పోలీసుల దృష్టి

Social Media Posts: సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న కథనాలపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైదరాబాద్‌ బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరిపై కేసులు నమోదు కాగా రాష్ట్రవ్యాప్తంగా మరో 43 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఏదో ఒకరోజు వీరందరిపైనా కేసులు నమోదవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Police special focus on Social Media posts
సామాజిక మాధ్యమాలపై పోలీసు కన్ను

By

Published : Jan 24, 2022, 10:30 AM IST

Social Media Posts:ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడంతో రకరకాల సామాజిక మాధ్యమాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితరాలతో పాటు ఎవరికివారు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న యూట్యూబ్‌ ఛానల్స్‌, వెబ్‌సైట్ల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీటిలో ప్రసారమవుతున్న సమాచారాన్ని ఏమేరకు విశ్వసించవచ్చన్నది పక్కనపెడితే రకరకాల అంశాలపై ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. వీటిని అడ్డం పెట్టుకొని చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా మతాలు, కులాల వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలూ లేకపోలేదు. మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు, వీడియోలు వాడటం సామాజిక మాధ్యమాల్లో సాధారణమైంది. ఉదాహరణకు కరోనాకు సంబంధించి చికిత్స, ముందు జాగ్రత్తలు అంటూ ఎవరెవరో ప్రముఖుల పేర్లు చెప్పి కుప్పలు తెప్పలుగా సమాచారం ప్రసారమవుతోంది. ఇదే సమయంలో అనేక మంది సామాన్యులు కూడా తమ కళ్లెదుట జరుగుతున్న అక్రమాలను సామాజిక మాధ్యమాలు వేదికలుగా ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించేవారిని, అక్రమాలకు పాల్పడుతున్నవారిని నిలదీస్తున్నారు. అయితే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సామాజిక మాధ్యమం ద్వారా విమర్శలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదయింది. వీరిద్దర్నీ అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత వదిలేశారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే నిర్మల్‌, హుజూరాబాద్‌, కరీంనగర్‌లకు చెందిన మరో ముగ్గురు సామాజిక మాధ్యమాల ప్రతినిధులపైనా కేసులు పెట్టి నోటీసులు పంపారు.

సుప్రీంకోర్టే చెప్పినా

Supreme court on Social media posts: వాస్తవానికి డిజిటల్‌ మాధ్యమం మాటున జరిగే నేరాలను అదుపు చేసే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఐటీచట్టం తీసుకొచ్చింది. ఇందులో ప్రధానమైంది ‘సెక్షన్‌ 66ఎ’. ఏదైనా డిజిటల్‌ మాధ్యమం ద్వారా వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, బెదిరించేలా సమాచారం ప్రసారం చేస్తే ఈ చట్టం కింద కేసు నమోదు చేయవచ్చు. దీనిపై పౌరహక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు 2015లో ఈ చట్టాన్ని తప్పుపట్టింది. అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ ఈ చట్టం కింద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో పౌరహక్కుల సంఘం గతేడాది సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ‘సెక్షన్‌ 66ఎ’ రద్దు చేసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా 1307 కేసులు నమోదు చేశారని, వాటిలో 2021 మార్చివరకూ 745 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని అందులో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా తెలంగాణ పోలీసులు.. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్‌ కింద కాకుండా ఇతరత్రా చట్టాలు ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకు బాలానగర్‌ కేసులో ఐటీచట్టం ప్రస్తావన లేదు. ఐపీసీలోని 505(1)(బి), 504 వంటి సెక్షన్లు ఉపయోగించారు. అంటే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రశాంతతకు భంగం కలిగించేలా నేరానికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అసభ్య పదజాలంతో ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నమాట.

ఎక్కడికక్కడ విశ్లేషణ

సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న సమాచారంతో శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశమున్న నేపథ్యంలో వీటిని ఎప్పటికప్పుడూ గమనిస్తుండాలన్న ఉద్దేశంతో పోలీసుశాఖ ‘సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. డిజిటల్‌ మాధ్యమాల్లో జరుగుతున్న ప్రసారాలను ఈ కేంద్రాలు పరిశీలిస్తుంటాయి. ఏదైనా విద్వేషపూరిత సమాచారం కనిపిస్తే దాన్ని నిరోధించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడం వీటి ఉద్దేశం. కానీ ఈ కేంద్రాలు.. విమర్శలు చేసే వారిని, తప్పులను ఎత్తిచూపే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెక్షన్‌66ఎ ఐటీ చట్టం ఏం చెబుతోంది..

తప్పని తెలిసి కూడా ఎదుటి వ్యక్తిని బెదిరించేలా, అసౌకర్యానికి గురయ్యేలా, ప్రమాదానికి కారణమయ్యేలా, అవరోధాలు కల్పించేలా, కించపరిచేలా, శత్రుత్వం-ద్వేషం పెంచేలా, దురుద్దేశంతో కూడిన సమాచారాన్ని ఆన్‌లైన్లో చేరవేయడం నేరం అని సెక్షన్‌66ఎ ఐటీ చట్టం చెబుతోంది.

ABOUT THE AUTHOR

...view details