జంట నగరాల్లో మైనర్లు వాహనాలు నడపకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. వాహనాలతో రోడ్లపైకి వస్తున్న మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఫలితంగా వాహనదారులతో పాటు ఇతరులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా రయ్ రయ్ మంటూ రోడ్లపైకి దూసుకొస్తున్నారు మైనర్లు. తల్లిదండ్రుల గారాబంతో ప్రమాదాల బారిన పడి, కటకటాల పాలవుతున్నారు. రాత్రి సమయాల్లో మైనర్ల వాహన విన్యాసాలు మరీ అధికమవుతున్నాయి. అతి వేగంతో వాహనాలు నడుపుతూ... బృందాలుగా ఏర్పడి నగరంలో చక్కర్లు కొడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్, నెక్లెస్ రోడ్, పాత బస్తీ వంటి ప్రాంతాల్లో మైనర్లు స్టంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారి కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.