పలు ప్రాంతాల్లో స్పైషల్ డ్రైవ్స్... మాస్కు ధరించని వారికి జరిమానాలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చార్మినార్‌లో మాస్కు ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా వేశారు. కరోనా పట్ల అవగాహన కల్పించారు. తార్నాకలో కొందరికి చలానా విధించిన పోలీసులు... బాధ్యతతో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా సురారంలో సామాజిక కార్యకర్త రవీందర్ మాస్కులు పంపిణీ చేశారు.
తనిఖీలు చేపట్టి..
జగిత్యాల జిల్లాలో ఒక్కరోజే 546 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఏడుగురు మరణించటంతో... అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న కోరుట్ల, మెట్‌పల్లి, కొండ్రికర్లలో జిల్లా కలెక్టర్ రవి పర్యటించారు. మాస్కులు ధరించని ద్విచక్రవాహనాదారులను ఆపి జరిమానా విధించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట పురపాలికలోని వ్యాపారసముదాయాలపై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
అవగాహన కల్పించి..
యాదాద్రిలో మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పోలీసులు కళాబృందాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కు ధరించకపోతే ఎదురయ్యే సమస్యలను వివరించారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కీలక నిర్ణయం..
కరోనా కట్టడిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీ నియంత్రించేందుకు ప్లాట్ ఫాం టికెట్ ధర 50 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. అసంఘటిత కార్మికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాలని అధికారులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు.
ఇదీ చూడండి:హరియాణాలో రాత్రి కర్ఫ్యూ- 'మహా'లో పరీక్షలు వాయిదా