భారీ వర్షం హైదరాబాద్ పట్టణానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరాశ్రయుల్ని చేసింది. వరదల్లో ఏకంగా కాలనీలే మునిగిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో ఇళ్లను వదిలి బిక్కుబిక్కుమంటూ.. ఆశ్రయం కోసం చూస్తున్నారు. కొంతమంది బాధితులు పై అంతస్తుల్లోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద వల్ల నిత్యావసర సరుకులు, సామాన్లు మొత్తం తడిచిపోవడం వల్ల తాగునీటికి, భోజనానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులకు పోలీసులు బాసటగా నిలుస్తున్నారు. గత మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వరదల వల్ల చాలామంది అవస్థలు పడుతుంటే పోలీసులు ప్రాణాలు తెగించి వాళ్లను కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ సిబ్బందితో సమానంగా, సాహసోపేతంగా వరద ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ గంటగంటకు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఒక్కడే.. 25 మందిని కాపాడాడు
వరదల వల్ల చాలామంది కానిస్టేబుల్స్ ఇళ్లు కూడా నీళ్లలో మునిగిపోయాయి. వాళ్లు కుటుంబాన్ని సైతం వదిలి విధుల్లో నిమగ్నమై బాధితులకు సేవ చేస్తున్నారు. హిమాయత్ సాగర్ జలాశయం నుంచి గేట్లు ఎత్తుతామని జలమండలి అధికారులు చెప్పగానే.... మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు నచ్చజెప్పిన పోలీసులు... వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. టోలీచౌకి, జియాగూడ, చాదర్ ఘాట్, మలక్ పేట్, దిలుసుఖ్ నగర్ ప్రాంతాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని దోమలగూడ, అరవింద్ నగర్లో కానిస్టేబుల్ వీరేందర్ కుమార్ ఒక్కడే 25 మందిని వరదనీటి నుంచి బయటికి తీసుకొచ్చారు. సైదాబాద్ పీఎస్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన బాధితులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
ప్రాణాలు లెక్కచేయకుండా..
వర్షానికి నానడం వల్ల.. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పాత ఇండ్లు కూలిపోయాయి. ప్రహరీగోడలు నేలమట్టమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సమీపంలో ఉన్న గుట్టలపై నుంచి రాళ్లు కిందపడ్డాయి. ఆయా ప్రాంతాలకు తక్షణమే చేరుకున్న పోలీసులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పలు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను ఆక్టోపస్ బృందాలతో కలిసి బయటికి తీసుకొచ్చారు. చాదర్‌ఘాట్ పోలీసులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. మూసీ వరద ఉద్ధృతి క్రమంగా పెరగడం వల్ల మూసానగర్‌లో ఇంట్లో చిక్కుకుపోయిన 15 మందిని చాదర్ ఘాట్, సుల్తాన్ బజార్ పోలీసులు కాపాడారు. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలార్ జంగ్ మ్యూజియం రహదారిలో ఆర్టీసీ బస్సుపై పెద్ద వృక్షం విరిగి పడింది. విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లు చెట్టును ఆర్టీసీ బస్సు పైనుంచి తొలగించి బస్సును అక్కడి నుంచి పక్కకు జరిపారు. వర్షాల వల్ల ఆల్మాస్ గూడలోని సాయిబాలాజీ టౌన్షిప్ మొత్తం వరదనీటితో నిండిపోయింది. ఇళ్లల్లో ఉన్న వాళ్లను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వనస్థలిపురంలోని హరిహరపురం కాలనీ మొత్తం వరద నీటితో మునిగిపోయింది. నిరాశ్రయులైన కాలనీవాసులను బోట్లసాయంతో పోలీసులు బయటికి తీసుకొచ్చారు. హయత్ నగర్‌లోని పెద్ద అంబర్పేట్ వద్ద వరద నీటిఉద్ధృతికి లారీ పడిపోయింది. డ్రైవర్ రాంరెడ్డిని పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సాయంతో కాపాడారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం సాగర్ పంపు ప్రాంతంలోని వంతెన వద్ద చిక్కుకున్న మృతదేహాన్ని సురేందర్ అనే కానిస్టేబుల్ సాహసించి బయటికి తీశాడు. జేసీబీ సాయంతో వరదప్రవాహంలోకి దిగిన సురేందర్... మృతదేహానికి తాడుకట్టి బయటకు తీశాడు. సురేందర్ సాహసాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ట్విటర్ ద్వారా ప్రశంసించారు.
అధికారుల ప్రశంసలు..
ట్రాఫిక్ పోలీసులు సైతం వరదను లెక్కచేయకుండా రహదారులపై విధులు నిర్వహిస్తున్నారు. రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించారు. మ్యాన్‌హోళ్లలో ఉన్న చెత్తను తొలగించి వరద నీళ్లు సక్రమంగా వెళ్లేలా చేశారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారులపై నిలిచిన వరద నీటిని జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి తొలగించారు. పోలీసుల సహాయక చర్యలను డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భవగత్లు ప్రశంసించారు. వర్షం తగ్గినా.... లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు అలాగే నిలిచిపోయి.. గందరగోళంగా ఉంది. మరికొన్ని ప్రాంతాలు బురదతో నిండిపోయాయి. బాధితులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సహాయక చర్యలు కొనసాగిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇవీచూడండి:భాగ్యనగరంలో బీభత్సం.. ప్రతి ఒక్కరు సాయం చేయండి: గవర్నర్