తెలంగాణ

telangana

ETV Bharat / state

Lockdown: లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై పోలీసుల మల్లగుల్లాలు - లాక్​డౌన్​ కేసులపై పోలీసుల ఆరా

లాక్‌డౌన్‌(Lockdown)లో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. వ్యక్తిగత దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేశారు. కానీ.. ఇప్పుడిదే పోలీసులకు తలనొప్పిగా మారింది. గత లాక్‌డౌన్‌లో నమోదైన కేసులే ఇంకా కొలిక్కి రాలేదు. ఈ కొత్త కేసుల సంగతి ఎలా..? వీరందర్ని కోర్టుల ముందు ఎలా హాజరుపర్చాలి..? అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు.

lockdown violations in hyderabad
Lockdown: లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై పోలీసుల మల్లగుల్లాలు

By

Published : Jun 23, 2021, 9:52 AM IST

పోలీసులు లాక్‌డౌన్‌(Lockdown)ను అత్యంత పటిష్ఠంగా అమలు చేశారు. అనవసరంగా రోడ్డెక్కిన వాహనదారులపై కొరడా ఝుళిపించారు. పలువురిపై కేసులు నమోదు చేసి వాహనాలను సైతం సీజ్‌ చేశారు. ఇప్పుడది పోలీసులకు ఇబ్బందిగా మారింది. వారిని కోర్టుల ముందు ఎలా హాజరు పరచాలి అంటూ ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే గత లాక్​డౌన్​లో నమోదైన కేసులే ఇంకా తేలలేదు. ఇక ఈ ఏడాది నమోదైన కేసుల పరిస్థితి ఎంటి, ఎలా పరిష్కరించాలని సమాలోచనలు చేస్తున్నారు.

ట్రాఫిక్‌ చలానా

సైబరాబాద్‌లో సుమారు 5వేలు, రాచకొండ 25వేల వరకు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గత లాక్‌డౌన్‌లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి చెక్‌పాయింట్‌ దగ్గర ఫంక్షన్‌ హాల్‌, మైదానాన్ని ఎంపిక చేసి ఈ వాహనాలను పార్కింగ్‌ చేశారు. పర్యవేక్షణను ఎస్సై/ఏఎస్సైకు అప్పగించారు. వీటిపై రూ.వేయి ట్రాఫిక్‌ చలానా విధించి.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతామంటూ స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకుని పంపించేశారు. సీజ్‌ అయిన వారం.. పది రోజుల్లోపే తిరిగి యజమానులకు అప్పగించడంతో ‘వాహనాల’ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.

ఓటీపీ సాయంతో..

లాక్‌డౌన్‌(Lockdown) నిబంధనల ఉల్లంఘన, మాస్క్‌ ధరించకపోవడం, వ్యక్తిగత దూరం పాటించకపోవడం, గుంపు గుంపులుగా సంచరించిన వారి ఫోన్‌ నంబర్లను క్షేత్రస్థాయి సిబ్బంది ట్యాబ్‌లో నమోదు చేశారు. అనంతరం ఆ ఫోన్‌ నంబర్‌కొచ్చిన ఓటీపీని తిరిగి ఎంట్రీ చేసి.. పిటీ కేసులు పెట్టారు. ఆధార్‌కు లింక్‌ చేశారు. ఈ తరహాలో సైబరాబాద్‌లో 60వేలు, రాచకొండలో 90వేలు నమోదు చేశారు. వీరందర్ని న్యాయస్థానాల్లో హాజరుపరిస్తే.. న్యాయమూర్తులు రూ.వేయి జరిమానా విధిస్తారు. వీరిని కోర్టులకు రప్పించడం పోలీసులకు పెద్ద సవాలే అని చెప్పాలి.

30 మంది వరకు

ఒక్కో ఠాణా పరిధిలో రోజు 100 నుంచి 150 మంది హాజరైతేనే ఇవి పరిష్కారమవుతాయి. ‘ఆధార్‌లో ఒక చిరునామా ఉంటుంది. వాళ్లేమో ఇంకో చోట ఉంటారు. ఇలాంటి వారిని కనిపెట్టడం కష్టమే’ అంటూ ఓ ఇన్‌స్పెక్టర్‌ వాపోయారు. ‘రోజు 20 నుంచి 30 మంది వరకు తీసుకుని రాగలుగుతాం. అంతకు మించి తేవడం అసాధ్యం’ అని మరో ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. ‘వాహనాలకు వేసిన చలాన్లను కట్టకపోతే ఎప్పుడోసారి ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీల్లో దొరికిపోతారు. కానీ వీళ్ల ఆచూకీ కనిపెట్టడం మాకు సవాలే’ అని ఇంకో ఇన్‌స్పెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం వేటు

ABOUT THE AUTHOR

...view details