ఏపీ బెజవాడ గ్యాంగ్ వార్ కేసు కొలిక్కి వస్తోంది. ఘర్షణలో పాల్గొన్న.. 25 మందిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. త్వరలో వీరి అరెస్టు చూపించబోతున్నారు. సందీప్, పండు మధ్య వ్యక్తిగత వైరమే కత్తులు దూసుకునేందుకు దారితీసిందని దర్యాప్తులో తేలింది. ఒకప్పుడు కలిసి తిరిగిన ఇద్దరూ మనస్పర్థలతో వేర్వేరు ముఠాలు కట్టారు. విజయవాడతోపాటు గుంటూరు జిల్లా సెంటిల్‌మెంట్లలోనూ.. తలదూర్చారు. విజయవాడలో ల్యాండ్ సెటిల్‌మెంట్లకు గుంటూరు జిల్లా నుంచి.. గుంటూరు జిల్లాలో తగాదాలకు బెజవాడ యువకులను వెంట తీసుకెళ్తున్నట్లు... పోలీసులు గుర్తించారు. బయటి వ్యక్తుల్ని గుర్తించే వీలుండదని వారు భావించినట్టుగా... అనుమానిస్తున్నారు. వీడియో ఆధారంగా కృష్ణా, గుంటూరు జిల్లాల యువకులు.. గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్నట్టు.. పోలీసులు ఆధారాలు సేకరించారు. మంగళగిరికి చెందిన పలువురున్నట్లు కూడా గుర్తించారు.
ఫోన్‌లోనే సవాళ్లు..
గత శనివారం జరిగిన గ్యాంగ్‌వార్‌లో సందీప్ మృతి చెందగా... పండు గాయాలతో చికిత్స పొందుతున్నాడు . తనతోపాటు సెటిల్మెంట్లో.. పండు కూర్చోవడం ఇష్టంలేని సందీప్.. రాత్రి అనుచరులతో కలిసి ఇంటికెళ్లిమరీ పండుతో గొడవపడ్డాడు . పండు శనివారం ఉదయం... సందీప్‌కు చెందిన స్టీల్ దుకాణం వద్దకు వెళ్లి గొడవ చేశాడు. దుకాణంలోని కుర్రాళ్లను కొట్టి... బ్లేడుతో గాయపరిచాడు. విషయం తెలిసిన సందీప్.. పండుకు ఫోన్ చేశాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఫోన్‌లోనే.. సవాళ్లు విసురుకున్నారు. తేల్చుకుందాం రా అంటూ.. స్పాట్ ఎంచుకున్నారు. సందీప్ తన అనుచరులకు ఫోన్ చేసి పటమటలోని అతని దుకాణం వద్దకు పిలిచాడు. అంతా కలిసి దుకాణంలోనే మద్యం తాగారు. పండు కూడా తన అనుచరులందరికీ.. ఫోన్ చేసి పిలిపించాడు. మద్యం, గంజాయి తెప్పించి బాగా కిక్కెక్కించాడు.