తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్సై పరీక్షా ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లడంపై రిక్రూట్​మెంట్ బోర్డు వివరణ - పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు తాజా వార్తలు

TSLPRB Chairman అత్యంత పారదర్శకంగా.. పకడ్బందీగా పోలీసులు నియామక పరీక్ష నిర్వహిస్తున్నామని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా... పోలీసు అభ్యర్ధలందరికీ మేలు చేయడమే.... తమ లక్ష్యమని పేర్కొన్నారు. తప్పైన ప్రశ్నలను తొలగించి వాటికి మార్కులు ఇవ్వడం చాలాకాలంగా కొనసాగుతున్న ఆనవాయితీనే అన్నారు. ఈ నెల 7న జరిగిన ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రంలో.. తప్పులు దొర్లడంపై ఆయన వివరణ ఇచ్చారు.

TSLPRB
TSLPRB

By

Published : Aug 15, 2022, 9:15 AM IST

TSLPRB Chairman: రాష్ట్ర పోలీసు శాఖలో 544 సబ్ ఇన్పెక్టర్ పోస్టులకు.. ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్ విడుదలకాగా.. ఆగష్టు 7న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. 12న ప్రశ్నాపత్రం కీ ని వెబ్ సైట్​లో పెట్టారు. ప్రశ్నాపత్రంలో 8 ప్రశ్నలు తొలగించారు. అయితే ఈ విషయంపై అభ్యర్థుల్లో ఏర్పడిన సందిగ్ధంపై.... రిక్రూట్ మెంట్ బోర్డు వివరణ ఇచ్చింది. తప్పైన ప్రశ్నలను తొలగించి... దానికి మార్కులు ఇవ్వడం అనేది దేశ వ్యాప్తంగా ప్రతి నియామక సంస్థ పాటించే నియమమని.. ఇదేమీ కొత్త కాదన్నారు. ఉదాహరణకు 2018-19లో జరిగిన పోలీసు నియామకాల సందర్భంగా.. ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలో... 11 ప్రశ్నలు తప్పులు పోయాయని... కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష, తుది పరీక్షల్లో 3 చొప్పున తప్పులు పోయాయన్నారు. అసలు ప్రతిసారి జరిగే పోలీసు నియామకాల్లోనూ.. సగటున 200 మార్కులకు నాలుగైదు ప్రశ్నలు తప్పులు పోతూనే ఉంటాయన్నారు.

ప్రశ్నాపత్రం రూపొందించడం అనేక దశల్లో అత్యంత రహస్యంగా జరుగుతుందని.. ఇందులో పాల్గొనే నిపుణులకు కూడా ఈ ప్రక్రియలో పరిమితమైన అనుమతి మాత్రమే ఉంటుందని.. ప్రతి దశలోనూ అందరూ పాల్గొనడం కానీ.. అందరికీ అన్ని విషయాలు తెలియడం కానీ జరగదని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా.. కొన్ని ప్రశ్నలు సరిగా అర్ధం కాకపోవడం, అస్పష్టంగా ఉండటం, అనువాద దోషాల కారణంగా తప్పులు దొర్లడం.. ఇచ్చిన జవాబుల్లో సరైనది లేకపోవడంతోపాటు ఒకదానికి మించి ఎక్కువ జవాబులు ఉండటం వంటి పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయన్నారు. తప్పైన ప్రశ్నలను తొలగించి.. వాటికి మార్కులు ఇవ్వడం వెనుక నియామక మండలి ఉద్దేశం అభ్యర్థులకు మేలు చేయడం కోసమే అన్న విషయం గుర్తించాలన్నారు. నియామక ప్రక్రియ అంతా.. పూర్తి పారదర్శకంగా ఉండేలా చూసేందుకు.. అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నామని, వెబ్‌ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు.. అభ్యర్థులకు కూడా వ్యక్తిగతంగా ఈమెయిల్ చేయడం, సంక్షిప్త సందేశాలు పంపడం చేస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాలలలో ప్రచారమయ్యే ఊహాగానాలను నమ్మవద్దని.. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు వెబ్‌ సైట్‌ను ఎప్పటికప్పుడు అనుసరిస్తుండాలని.. శ్రీనివాసరావు అభ్యర్థులకు సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details