Police Real Estate Friendship: స్థిరాస్తి దందాలో వేలు పెట్టే కొందరు పోలీసులు కోట్లకు పడగలెత్తుతున్నారు. నీకింత...నాకింత అన్నట్లుగా రియల్ వ్యాపారులతో పెనవేసుకుంటున్న దోస్తీ చాలాచోట్ల పోలీసు ప్రతిష్ఠను మసకబారుస్తోంది. వంత పాడితే కొంత, వదిలేస్తే ఇంకొంత.. అన్నట్లుగా వ్యవహరించే తీరును బట్టి వారి రేటు మారుతోంది. ఇలాంటివి బయటపడ్డప్పుడు మాత్రం రచ్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మంగళవారం నాటి ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులోనూ కొందరు పోలీసులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూవివాదాల్లో పోలీసుల పాత్రపై తిరిగి చర్చ మొదలైంది.
శివారు పోస్టింగులకు డిమాండ్..
రాష్ట్రంలో ప్రస్తుతం సైబరాబాద్, సంగారెడ్డి పోలీస్ యూనిట్ల పరిధిలోని కొన్ని ఠాణాల పోస్టింగులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయా స్థానాల కోసం పలువురు అధికారులు అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఓ ఠాణా పోస్టింగ్ కోసం గతంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ప్రయత్నాలు చేశారు. వారికి ఇవ్వడం ఇష్టం లేని ఉన్నతాధికారి మరో ఇన్‌స్పెక్టర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. చేరినప్పటి నుంచి ఆయన విశ్వరూపం ప్రదర్శించడం మెదలుపెట్టాడు. ఓ వివాదంలో బాధితుడిపైనే కేసు పెట్టడం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో వేటు పడింది.
భూవివాదంలో సస్పెండ్ అయిన అధికారికి...
మంచి పోస్టింగులు తెచ్చుకునేందుకు కొందరైతే ఖర్చుకూ వెనుకాడటంలేదు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఓ జిల్లాలో కీలక పోస్టు దక్కించుకునేందుకు అధికారి తన ఇల్లు కూడా అమ్మినట్లు తెలుస్తోంది. గతంలో భూవివాదంలో తలదూర్చి సస్పెండ్ అయిన ఆ అధికారి ఇప్పుడు ఏకంగా ఇంటినే బేరం పెట్టి నచ్చిన పోస్టు దక్కించుకున్నట్లు పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణలో గతంలో ఓ వివాదంలో చిక్కుకొని, కొన్ని నెలలుగా లూప్‌లైన్లో ఉన్న అధికారి అనూహ్యంగా మంచి పోస్టింగ్ దక్కించుకోవడమూ ఆ కోవలోనిదే. రాజధాని శివార్లలోని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అయితే కానిస్టేబుల్ పోస్టుకు కూడా మంచి డిమాండు ఉంది.
వసూళ్ల తీరు మారింది...
ఒకప్పుడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న వ్యాపార సంస్థల నుంచి చాలాచోట్ల నెలవారీ మామూళ్లు వసూలు చేసేవారు. ఇది వివాదంగా మారడం, అధికారులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుండటంతో రూటు మార్చారు. భూవివాదాలు ఆదాయ మార్గంగా మారాయి. ఒక్క గట్టి భూవివాదం సెటిల్‌చేస్తే నెలవారీ మామూళ్ల కంటే ఎక్కువ దక్కుతుండటంతో కొంతమంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. అన్యాయం జరిగినా పలు సందర్భాల్లో బాధితులు బయటపడటంలేదు. ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పుడో, ఏదైనా వివాదం బహిరంగమైనప్పుడో మాత్రమే ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు గ్యాంగ్‌స్టర్ నయీం వందలాది ఎకరాలను బలవంతంగా లాక్కున్నాడు. ఇందుకు అనేక మంది పోలీసులు కూడా సహకరించారు. ఎక్కడా ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. నయీం మరణించిన తర్వాత అనూహ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 290 కేసులు నమోదయ్యాయి.
పోస్టింగులకు ఖర్చూ మంచి పెట్టుబడే!