రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన కేంద్రాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 363 కేసులు నమోదు చేసి 516 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చేపట్టిన తనిఖీల్లో 5499 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ బృందాలు దందాను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
రాష్ట్రంలో ఉత్తర మండలం పరిధిలో 253 మందిపై 153 కేసులు, పశ్చిమ మండలం పరిధిలో 202 మందిపై 165 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 కేసుల్లో 17 మందిని అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు నమోదు చేసి 14మందిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13 కేసులు నమోదు చేసిన పోలీసులు 23 మందిని అరెస్ట్ చేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6 కేసులు నమోదు కాగా.. ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. 2014 నుంచి గతేడాది వరకు 515 కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది ఇప్పటి వరకే 363 కేసులు నమోదు చేయడాన్ని బట్టి చూస్తే.. పోలీసులు ఏ స్థాయిలో నిఘా పెట్టారో అర్థమవుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి.