Police Raids On Farm Houses In Hyderabad: విందులు, వినోదాల పేరుతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫామ్ హౌజ్‌లు, పబ్‌లు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. వారాంతాల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ ఆహ్లాదాన్ని పంచుతామంటూ డబ్బులు లాగుతున్నాయి. ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహించడం, అర్ధనగ్న దృశ్యాలు ఏర్పాటు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పలు
పబ్‌లు, ఫామ్ హౌజ్‌లపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో నిఘా పెట్టారు. గత వారం నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫామ్ హౌజ్‌లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. పబ్‌లు సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మైనర్లకు మద్యం సరఫరా చేయడం, అర్ధరాత్రి దాటినా మద్యం సరఫరా చేస్తుండటం లాంటి విషయాలు పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఫామ్ హౌజ్‌లు, పబ్ లపై పోలీసులు చర్యలు చేపట్టారు.
మైనర్లకూ మద్యం సరఫరా: గత రెండు రోజులు సైబరాబాద్ పరిధిలోని 33 ఫామ్ హౌజ్‌లలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. మొయినాబాద్‌లోని సెలబ్రిటీ, ఎటెర్నిటీ, ముషీరుద్దీన్ ఫామ్‌హౌజ్‌లలో అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. దీంతో ఈ మూడు ఫామ్ హౌజ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేసి కాపలాదారులను అరెస్ట్ చేశారు. యజమానులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 16 పబ్‌లలోనూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా మైనర్లకు మద్యం సరఫరా చేసినట్లు గుర్తించిన రెండు పబ్‌లపై కేసులు నమోదు చేశారు. మాదాపూర్‌లోని హార్ట్ పబ్‌లో 21ఏళ్ల లోపు వాళ్లకు మద్యం సరఫరా చేసినట్లు గుర్తించారు. ఆబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం 21ఏళ్ల లోపు వాళ్లకు పబ్‌లలో మద్యం సరఫరా చేయకూడదు. బర్డ్ బాక్స్ పబ్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించి యజమాని వంశీవర్ధన్, మేనేజర్ అర్జున్‌లను అరెస్ట్ చేశారు.
ఈ నెంబర్‌కు కాల్ చేయండి: ఆరు రోజుల క్రితం ఎస్ఓటీ పోలీసులు శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్ పరిధిలో ఉన్న 32 ఫామ్ హౌజ్‌లలో తనిఖీలు నిర్వహించారు. 4 ఫామ్ హౌజ్ లలో పేకాటతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి 22మందిని అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పబ్ లు, ఫామ్ హౌజ్‌లలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తెలిస్తే సైబరాబాద్ పోలీసుల వాట్సాప్ నెంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని ఎస్ఓటీ పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: