Police Preliminary Examination: రాష్ట్రంలో పోలీస్ నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షలను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) సన్నాహాలు చేస్తోంది. జులై చివరి లేదా ఆగస్టు తొలివారంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నారు. అభ్యర్థుల వడపోతగా భావించే ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలను సెప్టెంబరులోగా ప్రకటించాలనే ప్రయత్నాల్లో ఉన్నామని నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు చెప్పారు. అక్టోబరు రెండో వారంలో శారీరక సామర్థ్య(పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహిస్తామని, నవంబరులోగా ఫలితాలిస్తామని.. జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాతపరీక్షలుంటాయన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మార్చిలోపు తుది ఫలితాల్ని ప్రకటిస్తామన్నారు.
‘పలువురు అభ్యర్థులు ఎస్సై పోస్టులతో పాటు కానిస్టేబుల్‌గానూ ఎంపికవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కానిస్టేబుల్ పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌లు మిగిలిపోతున్నాయి. అందుకే ఎస్సైల ఎంపిక ప్రక్రియ ముందుగానే చేపడుతున్నాం. ఆ తర్వాత రెండు వారాలకు కానిస్టేబుల్ పరీక్షలు జరుపుతున్నాం. దీనివల్ల ఎస్సైలుగా ఎంపికైన వారిని కానిస్టేబుల్ పోటీ నుంచి తప్పిస్తున్నాం. క్రితంసారి ఇలా చేయడంతో 680 కానిస్టేబుల్ పోస్టులను బ్యాక్‌లాగ్ కాకుండా నివారించగలిగాం.
-- పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు